ఎరోస్పేస్‌ వ్యవస్థను..  కేంద్ర ప్రభుత్వం నాశనం చేసింది


– రాఫెల్‌ ఒప్పందలో హెచ్‌ఏఎల్‌ను ఎందుకు భాగస్వామ్యం చేయలేదు?
– ట్విట్టర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ
బెంగళూరు, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : భారత ఎరోస్పేస్‌ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. రఫేల్‌ ఒప్పందంలో హిందుస్థాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)ను ఎందుకు భాగస్వామి చేయలేదని ప్రశ్నిస్తున్న ఆయన… శనివారం
ఆ సంస్థ ఉద్యోగులతో సమావేశం అయ్యారు. అంతకు ముందు ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా ఈ తెలుపుతూ… ‘హెచ్‌ఏఎల్‌ సంస్థ అనేది భారత వ్యూహాత్మక సంపద అన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం నుంచి దాన్ని తొలగించి ఏరోస్పేస్‌ రంగంలో దేశ భవిష్యత్తును నాశనం చేశారని విమర్శించారు. అనిల్‌ అంబానికి బహుమానం ఇచ్చారన్నారు. హెచ్‌ఏఎల్‌ ఉద్యోగులకు మద్దతు తెలపడానికి నేను బెంగళూరులో ఉన్నానని రాహుల్‌ పేర్కొన్నారు. కాగా, రఫేల్‌ ఒప్పందంలో మోదీ.. ఓ ప్రయివేటు సంస్థకు లాభాలు కలిగేలా వ్యవహరించారని రాహుల్‌ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ ఇష్ట ప్రకారమే తాము భారత్‌లోని ఓ సంస్థను భాగస్వామిగా చేర్చుకున్నామని డసో తెలిపినట్లు ఇటీవల ఫ్రాన్స్‌ విూడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో రాహుల్‌ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఒప్పందంలో హెచ్‌ఏఎల్‌ను భాగస్వామి చేయకపోవడం వల్ల ఆ యుద్ధ విమానాల తయారీ సాంకేతికతను అందింపుచ్చుకోలేకపోతున్నామని, అంతేగాక దేశంలోని వేలాది టెక్నీషియన్లకు కొత్త ఉద్యోగాలు రాకుండా పోయాయని ఆయన అంటున్నారు. భాజపా మాత్రం రాహుల్‌ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఆయన అన్నీ అసత్యాలే చెబుతున్నారని ఆరోపిస్తోంది.