ఎర్రకోటలో బాంబు.. రాజధానిలో కలకలం

న్యూఢిల్లీ :

దేశ రాజధాని ఢిల్లీలోని సుప్రసిద్ధ ఎర్రకోటలో ఓ బాంబు బయటపడింది. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. రాజధానిలో ఎలర్ట్ ప్రకటించారు. సాధారణంగా రోజూ చేసే తనిఖీలలో భాగంగానే ఎర్రకోటలో భద్రతాదళాలు తనిఖీ చేస్తుండగా అక్కడున్న ఓ బావిలో ఈ బాంబు కనిపించింది. వెంటనే నేషనల్ సెక్యూరిటీ గార్డులతో పాటు డీసీపీ నేతృత్వంలోని పోలీసు బృందం కూడా హుటాహుటిన అక్కడకు చేరుకుని భారీ మొత్తంలో ఆ ప్రాంతమంతా తనిఖీలు చేశారు. ఇంకా ఎక్కడైనా ఏమైనా ఉన్నాయేమోనని బాంబు స్క్వాడ్‌ను కూడా తీసుకొచ్చి ముమ్మరంగా గాలించారు.

ముందుగా బావిలో ఉన్న గ్రెనేడ్‌ను బయటకు తీసి, దాన్ని నిర్వీర్యం చేసి పరీక్షల కోసం తీసుకెళ్లారు. అది ఏమైనా ప్రపంచయుద్ధ సమయం నాటిదా లేదా వేరే ఏమైనానా అనే విషయాన్ని నిర్ధారించనున్నారు. ఇంతకుముందు ఫిబ్రవరి నెలలో కూడా ఒకసారి ఎర్రకోట లోపల ఉన్న ఓ బావిని శుభ్రం చేస్తుండగా అందులో పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రితో కూడిన కొన్ని బాక్సులు కనిపించాయి. ఇప్పుడు కూడా అలాగే బాంబు బయటపడటంతో ఎన్‌ఎస్‌జీ బృందాలకు సైతం సమాచారం అందించారు. స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే లాంటి వేడుకలు జరిగే ఎర్రకోటలో ఇంతలా బాంబులు, పేలుడు పదార్థాలు బయట పడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.