ఎర్రబెెెల్లికి ఊరట
పాలకుర్తి /హైదరాబాద్,సెప్టెంబర్28(జనంసాక్షి):
తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు జనగామ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాలకుర్తిలో తెలుగుదేశం , తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల మద్య జరిగిన ఘర్షణ సందర్భంగా దయాకరరావుపై పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు.గత రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లోనే ఉంచి , ఉదయం జనగామ కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించగా, బెయిల్ పిటిషన్‌పై సాయంత్రానికి బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తుల జమానతు, రూ.10వేల పూచికత్తు చెల్లించాలని ఆదేశించింది. ఆయనతో పాటు మరో 20 మంది టిడిపి కార్యకర్తలకు బెయిల్ మంజూరు చేసింది. వరంగల్ జిల్లా పాలకుర్తిలో మార్కెట్ యార్డు ప్రారంభం సందర్భంగా తెరాస, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి రాళ్లు రువ్వుకున్న సంగతి తెలిసిందే. ఈఘటనలో ఇరుపక్షాలకు చెందిన 40 మంది గాయపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా టిడిపి నిరసనలు, ధర్నాలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీటీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నయా నిజాం కేసీఆర్‌ను ప్రజలు పాతరేయడం ఖాయమని అన్నారు. పాలకుర్తి ఘర్షణలో గాయపడిన ఎర్రబెల్లి దయాకర్ రావుని టీడీపీ సీనియర్ నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లి, సాయన్న, గాంధీ, ప్రకాష్‌గౌడ్, గుండు సుధారాణి, తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎల్. రమణ మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కష్టపడి
సాధించిన తెలంగాణ క్రూరుడి చేతిలోకి వెళ్లిందన్నారు. ఎర్రబెల్లిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కేసీఆర్ దుర్మార్గుడని మరో నేత మోత్కుపల్లి దుమ్మెత్తిపోశారు. ప్రస్తుతం మంత్రి పదవి అనుభవిస్తున్న కడియం శ్రీహరికి రాజకీయ భిక్ష పెట్టిందే దయాకర్ రావు అని అన్నారు. పోలీసులు కేసీఆర్ చుట్టాల్లా వ్యవహరిస్తున్నారు మోత్కుపల్లి ఆరోపించారు.
బిజెపి,కాంగ్రెస్ నేతల ఖండన
తప్పుడు కేసులు పెట్టి విపక్ష నేతలను అరెస్టు చేయించడం అప్రజాస్వామికమని తెలంగాణ శాసనసభలో బిజెపి పక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో టిడిపి,టిఆర్‌ఎస్ కార్యకర్తల ఘర్షణ నేపద్యంలో టిడిపి నేత ఎర్రబెల్లి దయాకరరావును అరెస్టు చేయడంపై లక్ష్మణ్ మండిపడ్డారు. దయాకరరావు అరెస్టు అప్రజాస్వామికమని ఆయన అన్నారు. విపక్షాలను అణచాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన విమర్శించారు. మిత్రపక్షంగా బిజెపి నేత టిడిపి నేత ఎర్రబెల్లికి నైతికంగా మద్దతు ఇచ్చారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సరికాదని మండిపడ్డారు. అధికారపక్షం ప్రొటోకాల్ పాటించడం లేదని ఆయన ఆరోపించారు. విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం సరికాదని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపే నేతలను అణగదొక్కుతున్నారన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న చోట ప్రొటోకాల్ పాటించడం లేదని , ప్రభుత్వ కార్యక్రమాలను గులాబీమయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకోవడానికి అన్ని పక్షాలను కలుపుకొని వెళతామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల అనర్హతపై అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని , స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సైతం వెనుకాడమని పేర్కొన్నారు.