ఎర్రసూర్యుడు బర్ధన్‌ కన్నీటి వీడ్కోలు

1

న్యూఢిల్లీ,జనవరి 4(జనంసాక్షి):  కురువృద్ధ వామపక్ష అగ్రనేత ఏబీ బర్దన్‌ అంత్యక్రియలు సోమవారం దిల్లీలోని నిగంబోధ్‌లో పూర్తయ్యాయి. బర్దన్‌ అంత్యక్రియలకు వామపక్ష నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అంతకుముందు కమ్యూనిస్టు పార్టీ యోధుడు, సీపీఐ అగ్రనేత ఏ.బీ.బర్ధన్‌కు వామపక్ష నేతలు, కార్యకర్తలు,వివిధ పార్టీల నాయకులు ఘన నివాళి అర్పించారు. ఢిల్లీ సీపీఐ ప్రధాన కార్యాలయంలో బర్ధన్‌ పార్థివదేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. వామపక్ష పార్టీల బలోపేతానికి ఆయన నిరూపమాన సేవ చేశారని కొనియాడారు. ప్రజాందోళనల్లో ముందుండి నడిపించారని గుర్తు చేసుకున్నారు. వామపక్ష పార్టీలకు ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు వామపక్ష నేతలు. కమ్యూనిస్టు కురువృద్ధుడు ఏబీ బర్ధన్‌కు వివిధ పార్టీలు, నేతలు ఘనగా నివాళులు అర్పించాయి. వామపక్ష ఉద్యమానికి బర్దన్‌ మృతి తీరని లోటని లెఫ్ట్‌ పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి.  సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్‌ మృతికి నివాళిగా ఢిల్లీతో పాటు వివిధ రాష్టాల్ల్రో సంతాప సభలు జరిగాయి. ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంతాప సభలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో పాటు వివిధ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు బర్దన్‌కు నివాళులు అర్పించారు. వామపక్ష ఉద్యమానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో బర్దన్‌ సంతాప సభ జరిగింది. బర్దన్‌ అందరికీ ఆదర్శప్రాయుడని… ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. విద్యార్థి నేతగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బర్దన్‌ సేవలు అభినందనీయమని పలువురు నేతలు కొనియాడారు. బర్దన్‌ మరణం వామపక్షాలకు తీరనిలోటని అన్నారు. బర్ధన్‌ మృతిపట్ల సీపీఎం ప్రధాన నాయకులు సీతారాం ఏచూరి, బి.వి. రాఘవులు, తమ్మినేని వీరభద్రం,పి.మధుతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లోని సీపీఐ కార్యాలయాల్లో సంతాప సభలు జరిగాయి.