ఎవరెన్ని చెప్పినా అంతిమ విజయం తమదే
మళ్లీ కెసిఆర్ సిఎం కావడం ఖాయం: కొప్పుల
జగిత్యాల,డిసెంబర్8(జనంసాక్షి): ఎన్నికల ఫలితాలలో గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో విజయం సాధిస్తానని ధర్మపురి టిఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్నారు. ఉద్యమ సమయంలోనే నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరాభిమానంతో ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. 11న జరిగే కౌంటింగ్‌లో విపక్షాల డొల్లతనం బయటపడుతుందని అన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగున్నరేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రజల ఆదరణతో ఈ సారి అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సారథ్యంలో వంద సీట్లలో విజయం పొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, తెలంగాణ వెంటే ప్రజలు ఉన్నారన్నారు. గ్రామాల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూస్తే కేసీఆర్ మాత్రమే గ్రామాలను అభివృద్ధి చేస్తారని, అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తారనే నమ్మకం వారిలో కనిపించిందన్నారు. నియోజకవర్గ ప్రజల అండదండలు ఉనప్నాయని ఓటింగ్ సరళిని బట్టి అర్థం అయ్యిందన్నారు. నాలుగు పార్టీలు ఏకమై కుట్రల కూటమి కట్టినా ప్రజలు గులాబీ పార్టీనే ఆదరించారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ గ్రామంలో చూసినా ప్రజలు గులాబీ పార్టీకి మద్దతు ఇచ్చి కారుగుర్తుకే ఓటేశారన్నారు. ముఖ్యంగా పింఛన్లు తీసుకుంటున్న వారు, రైతులు, కళ్యాణలక్ష్మి లబ్దిదారులు, గొల్ల, కురుమలు, మత్స్యకారులు, చేతి కుల వృత్తిదారులు, అదే విధంగా కొత్తతరం యువత టీఆర్‌ఎస్ పార్టీనే ఆదరించారని అన్నారు. సబ్బండ వర్గాలు కేసీఆర్ పాలనపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు. తనకు ఓట్లేసిన ప్రతి ఒక్కరికీ, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.