ఎవరెస్టు శిఖరాల ఎత్తు కాకా కీర్తి

3
– తెలంగాణ కోసం అంపశయ్యపై ఎదురుచూపు

– కాలికి బుల్లెట్‌ తగిలిన లెక్కచేయక పోరాడిన యోధుడు వెంకటస్వామి

– విగ్రహావిష్కరణ సభలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌ 05 (జనంసాక్షి):

అనారోగ్యంగా ఉన్నా తనకు ఏవిూ కాదని, తెలంగాణ ఏర్పాటు కళ్లచూడాలన్నదే తన ఆశయమని కాకా చెప్పారని, అలాగే ఆయన తెలంగాణ ఏర్పాటును కళ్ల చూశారని సిఎం కెసిఆర్‌ అన్నారు.  కాకా ఆస్పత్రిలో ఉన్నపుడు తాను వెళ్లి కలిశానని అప్పుడు వెంకటస్వామి తనకు తెలంగాణ వచ్చిన తర్వాత చూసే కన్ను మూయాలని ఉందని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంపశయపై తెలంగాణ కోసం ఎదురు చూసిన యోదుడని ఆయన కొనియాడారు. చివరికి తెలంగాణను చూశాకే స్వర్గస్థుడయ్యారని తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ కూడా తెలంగాణ రాష్టాన్న్రి చూడాలని కోరుకునే వారని కానీ చూడకుండానే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.   ట్యాంక్‌బండ్‌పై దివంగత మాజీ కేంద్రమంత్రి జి.వెంకటస్వామి(కాకా) విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఆవిష్కరించారు. తాను కాకా విగ్రాహాన్ని ఆవిష్కరించినందుకు తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కాకా చేసిన సేవలను కొనియాడుతూ వెంకటస్వామి రాజకీయ భీష్ముడు అని కితాబిచ్చారు. సుధీర్ఘ రాజకీయ చరిత్ర, అపారమైన అనుభవం ఉన్న నిజమైన తెలంగాణ బిడ్డ అని తెలిపారు. తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్‌ దెబ్బ తగిలినా భయపడకుండా ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రస్తావన వస్తే చాలు అవును తెలంగాణ రాకూడదా, తెలంగాణ రావాల్సిందేనని కరాఖండిగా చెప్పేవారని గుర్తు చేశారు. చిన్నస్థాయి నుంచి మనిషి పెద్దస్థాయికి ఎదగగలడనేందుకు వెంకటస్వామి నిదర్శనమన్నారు. ఎవరెస్టు శిఖరమంత ఎత్తు ఎదిగిన దళిత నేత కాకా అని శ్లాఘించారు. పేదల కోసం, దళితుల కోసం అహర్నిశలు శ్రమించారని తెలిపారు. వెంకటస్వామి బాటలో నేటి యువత నడచి ఆయన  ఆశయాలను కొనసాగించాలన్నారు. అంబేద్కర్‌పార్కులో కాంగ్రెస్‌నేత, మాజీ మంత్రి వెంటకస్వామి విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. స్పీకర్‌ మధుసూధనాచారి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కాకా కుమారులు వినోద్‌, వివేక్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాకా కమిట్‌మెంట్‌ ఉన్న నాయకుడు: దత్తన్న

ప్రజల మనిషి కాకా (జి.వెంకటస్వామి) అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కాకా కమిట్‌మెంట్‌ ఉన్న నాయకుడని ఆయనను అన్ని వర్గాల ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు.. నిబద్ధత ఉన్న నాయకుడు వెంకటస్వామి అని కొనియాడారు. ఏడుసార్లు గెలిచారని, కేంద్ర మంత్రిగా ఎన్నో పర్యాయాలు పనిచేశారని గుర్తు చేశారు. కార్మిక మంత్రిగా కార్మికులకు ఎనలేని సేవచేశారని పేర్కొన్నారు. కార్మిక చట్టాల్లో మార్పులు రావాలని కోరుకున్న మ¬న్నత కార్మిక నేత కాకా అని శ్లాఘించారు. కార్మికులకు పెన్షన్లు ఇప్పించిన గొప్ప నేత కాకా అని అన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ నాయకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడరని పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో వెంకటస్వామి ఆత్మకథ ‘మేరా సఫర్‌’ను నేతలు ఆవిష్కరించారు.  వెంకటస్వామి రజకార్లను ఎదిరించి జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. పాత వ్యక్తులకు కాకా గురించి చెప్పాల్సిన అవసరంలేదని, కానీ కొత్త తరానికి వెంకటస్వామి గుర్తుండాలంటే ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని అన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. కాగా, విగ్రహావిష్కరణ కార్యక్రమంలో స్పీకర్‌ మధుసూధనాచారి పాల్గొన్నారు. జీవితాంతం ప్రజల పక్షాన

పోరాడిన మహానేత కాకా అని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆశీర్వదించి ఉద్యమానికి ఊతంనిచ్చిన నేత అని కొనియాడారు.  ఈ సందర్భంగా కాకా సేవలను నేతలు స్మరించుకున్నారు.

ట్రాఫిక్‌ జామ్‌తో ప్రజల ఇక్కట్లు

విగ్రహావిష్కరణ సందర్భంగా ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపేశారు. భారీగా ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇకపోతే నగరంలోని ట్యాంక్‌బండ్‌పై కొలువై ఉన్న మహామహుళ విగ్రహాల సరసన  తెలంగాణ నేత విగ్రహం కొలువు తీరింది.  అంబేద్కర్‌ విగ్రహం వెనుక ఏర్పాటు చేసిన పార్కులో కాకా విగ్రహాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ట్రాఫిక్‌ ఆపేసి కార్యక్రమాన్ని నిర్వహించడంపై మండిపడ్డారు.