ఎస్పీని సస్పెండ్ చేయండి
– నేరెళ్ల బాద్యులపై చర్యలు తీసుకోండి
– డీజీపీని కలిసిన అఖిలపక్షం
హైదరాబాద్,ఆగష్టు 11(జనంసాక్షి):నేరెళ్ల ఘటనపై మరోసారి విపక్షాలు కలిసి ముందుకు సాగాయి. దళితులపై దాడి వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు ముక్తకంఠంతో రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మను కోరాయి. శుక్రవారం డీజీపీని కలిసి ఎస్పీ విశ్వజిత్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. డీజీపీని కలిసిన అనంతరం విూడియాతో మాట్లాడుతూ అఖిలపక్షం నేతలు డీజీపీని కలిసినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. పోలీసు అధికారులపై ఎస్సీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదని డీజీపీని ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు. పోలీసులే దాడులు చేశారని ప్రభుత్వం ఒప్పుకున్నందువల్ల పోలీసు అధికారులపై కేసులు పెట్టాలని డీజీపీని కోరినట్లు భట్టి వివరించారు. ఇక నేరెళ్ల ఘటన జరిగి 40 రోజులు అవుతున్నా పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్ నియోజక వర్గంలో దళితులకు ప్రాణ రక్షణ లేదని ఆయన చెప్పారు. అలాగే మంత్రికి ప్రజలను చూసే తీరిక లేదని ఎద్దేవా చేశారు. దారుణంగా కొట్టిన ఎస్పీని సస్పెండ్ చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందని చాడ అన్నారు.
డీజీపీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గద్దు-రేవంత్ రెడ్డి
నేరెళ్ల ఘటనలో ఒక్క ఎస్సైనే బాధ్యుడిని చేయడం సరికాదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ పై బాధితులు ఫిర్యాదు చేశారని అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఇసుక లారీ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ అనురాగ్ శర్మను ప్రశ్నించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లు ఉంటే వాటికి తలొగ్గకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని తాను కోరానని ఆయన వెల్లడించారు. ఇక పోలీసులతో సంబంధం లేకండా మంత్రి కేటీఆర్ ఎస్సైని సస్పెండ్ చేసినట్లు ఎలా చెబుతారని పోలీస్ బాస్ ను అడిగామన్నారు. దీన్ని బట్టి పోలీసులు మంత్రి కేటీఆర్ సంతృప్తి కోసం పనిచేస్తున్నట్లుగా ఉందని తాము అర్థం చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రజలకోసం పోలీసులు పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.