ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడాలి ప్రజా యుద్ధ నౌక గద్దర్
తెలంగాణ చౌక్, నవంబర్ 6 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడాలని ప్రజాయుద్ధనౌక, కళాకారుడు గద్దర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ కార్మికులు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కరీంనగర్ బస్టాండ్‌ను అంబేద్కర్ బస్టాండ్‌గా మార్చాలని అన్నారు. ప్రపంచంలోని కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీల పదోన్నతులు, బదిలీలలో తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. దీనికి కార్మికులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. బహుజనుల హక్కుల కోసం పోరాటాలే శరణ్యమని తెలిపారు. దేశంలో ప్రతి రంగంలోనూ ఎస్సీ, ఎస్టీలపై వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు. అంబేద్కర్ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కోసం రిజర్వేషన్లు కల్పించినా వాటిని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమించాలని అన్నారు. ఈ సందర్భంగా రేకుర్తి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో లచ్చుపేట బాధితులకు దుప్పట్లు, దుస్తులు, పళ్లాలు అందించారు. ఎఫ్‌డీఐలతో కోటి ఇరవై లక్షల కుటుంబాలు బజారున పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకోసం చర్చలే శరణ్యం కాదని పోరాటాల ద్వారానే తెలంగాణ వస్తుందని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వం నియమించిన ఒక సంస్థ అని దాంతో ఏమి జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రస్తుతం జిల్లా చురుకుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాపయ్య, ప్రకాశ్‌నాయక్, రమేష్, శంకరయ్య, గణేష్, డి.రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.