ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా ఉండాలి

` బిల్లుతో రాజీవ్‌ గాంధీ కల నెరవేరింది
` చట్టం సమర్థ అమలుకు తక్షణమే కులగణన చేపట్టాలి’’
` బిల్లును  ఆలస్యం చేయొద్దు.. వెంటనే అమలు చేయండి
` మద్దతు తెలిపిన సోనియా గాంధీ
ఢల్లీి(జనంసాక్షి):చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ దీనిపై చర్చను మొదలుపెట్టి ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఈ నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ 2023 బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు.’’మహిళా రిజర్వేషన్‌ బిల్లును కాంగ్రెస్‌ సమర్థిస్తోంది. ఇది నాకు చాలా ఉద్వేగభరిత క్షణం. ఈ బిల్లును తీసుకురావడంతో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ స్వప్నం పూర్తిగా నెరవేరింది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని నా భర్త రాజీవ్‌ గాంధీ ఆనాడు రాజ్యసభలో బిల్లు తీసుకొచ్చారు. కానీ, అది రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఆ తర్వాత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ బిల్లును అమల్లోకి తీసుకురాగలిగింది. దాని ఫలితమే, స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహించగలిగారు’’ అని సోనియా గాంధీ తెలిపారు.’’ఈ బిల్లు ఆమోదం పొందాలని మేం ఆకాంక్షిస్తున్నాం. అయితే, కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. మహిళలు రాజకీయ బాధ్యతలు చేపట్టాలని గత 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఎంతకాలం వేచిచూడాలి? ఈ బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలి. ఆలస్యమైతే మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఈ కోటాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలి. చట్టం సమర్థ అమలుకు తక్షణమే కులగణన చేపట్టాలి’’ అని సోనియా గాంధీ కోరారు.