ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ప్రవేశ పెట్టాలి
నిజామాబాద్, అక్టోబర్ 26 : ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్సన్‌స్లేవ్ అన్నారు. శుక్రవారం స్థానిక కెవిపిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయడం కోసం కమిటీలను నియమించాలని, ఈ కమిటీకి ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన వహిస్తున్నారని ఆయన తెలిపారు. కమిటీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు సబ్‌ప్లాన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ గురించి ప్రత్యేక శాసనసభను నిర్వహించాలని ఆయన కోరారు. ప్రభుత్వం దళిత, గిరిజనులపై చిన్నచూపు చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను త్వరలో అమలు చేయకపోతే ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఆయన ముఖ్యమంత్రిని హెచ్చరించారు. దళితులపై సంవత్సరంలో ఐదువేలకు పైగా దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే అనధికారికంగా 10వేల దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారని అన్నారు. ఇప్పటికైనా దళితుల అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. ఎన్నికలు వచ్చే సమయంలోనే దళితులు, గిరిజనులు గుర్తుకు వస్తారని , అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అభివృద్ధిని మరిచిపోతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దళితుల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గంగాధర్, జిల్లా అధ్యక్షుడు పోశెట్టి, ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి