ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నిజామాబాద్‌, జూలై 19 : కామారెడ్డి పట్టణంలో ఉన్న ఎస్సీ(ఎ,బి), బాలికల, బాలుర (ఎస్‌హెచ్‌ఎమ్‌) హాస్టళ్లను కళాశాలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కలెక్టరేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నవీన్‌ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో ఉన్న ఎస్సీ(ఎ),(బి), బాలుర, బాలికల(ఎస్‌హెచ్‌ఎమ్‌) రెండు హాస్టళ్లు గతంలో కళాశాలలకు అందుబాటులో ఉండేవని, కానీ ఈ విద్యా సంవత్సరం సంక్షేమ అధికారులు ఎస్‌హెచ్‌ఎమ్‌ హాస్టళ్లను పక్క భవనంలోకి మార్చడం వలన విద్యార్థులకు కళాశాలకు రావాలంటే దాదాపు 8కిలో మీటర్లు నడవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి విద్యార్థులు హాస్టళ్లకు రావడం లేదన్నారు. దూరం ఉండడంతో బయట అద్దె భవనాలు తీసుకుంటూ చదువుతున్నారని చెప్పారు. వెంటనే ఇప్పటికైనా స్పందించి కళాశాల దగ్గర్లో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాణాప్రతాప్‌, రమేష్‌నాయక్‌, సాయిలు, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.