ఎస్‌బిహెచ్ ఖాతా నుంచి రూ.30వేలు మాయం
ఖమ్మం, అక్టోబర్ 26: జిల్లాలోని వెంకటాపురం మండలంలో గల ఎస్‌బిహెచ్‌కు చెందిన ఖాతాదారు ఖాతా నుంచి రూ.30వేల రూపాయలు మాయమైన సంఘటన వెలుగు చూసింది. బాధితుడు కె.వెంకటేశ్వర్లు, సంబంధించిన ఎస్‌బిహెచ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు తన ఖాతాలో రూ.30,093 నగదు నిల్వవున్నట్లు ఆయన తెలిపారు. గత సోమవారం భద్రాచలంలోని రామాలయం సమీపంలో గల ఎటిఎంలో డబ్బులు తీసుకునేందుకు వెళ్లి పరిశీలించగా, కేవలం 93 రూపాయలు ఉండడంతో ఆందోళన చెందానన్నారు. బ్యాంక్ అధికారులు ఆయన ఖాతాలోని నిల్వను పరిశీలించారు. ఈ నెల 21వ తేదీన జైపూర్‌లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎటిఎం నుంచి 30వేల రూపాయలు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు క్రమ సంఖ్య 174తో కూడిన వివరాలను ఖాతాదారుడికి ఇచ్చారు. కాగా ఎటిఎంలో సొమ్ము మాయమవడంపై వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.