ఏఐతో ఉద్యోగాలు పోవు

` అలాంటి పుకార్లు నమ్మొద్దు

` ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యాక్షన్‌ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ

పారిస్‌ (జనంసాక్షి): కృత్రిమ మేధ (ఏఐ) విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఏఐ పరిజ్ఞానంతో వచ్చే మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.ప్రస్తుతం ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ఆయన.. పారిస్‌ వేదికగా జరిగిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యాక్షన్‌ కమిటీ సమావేశానికి సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు. పలు దేశాల అధినేతలు, టెక్‌ రంగ నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు (ంఎ ూబీఎఎతిబి ఎని ఈతీజీనిఞవ)’’ఏఐ వల్ల మనం చేసే అన్ని పనుల్లో మార్పులు వస్తాయి. సాంకేతికత మానవ జాతికి ఉపయోగకరంగా ఉండాలంటే.. అది స్థానికంగా నెలకొన్న వ్యవస్థల్లోకి పాతుకొని పోవాలి. అందుబాటు ధరలో 140 కోట్ల మంది ప్రజల కోసం భారత్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విజయవంతంగా నిర్మించింది. ప్రస్తుతం ఏఐతో ఉద్యోగాలు పోతాయనే వదంతులు ప్రచారంలో ఉన్నాయి. చరిత్ర చూస్తే.. పని ఎప్పుడూ ఉంటుంది. అయితే పనిచేసే పద్ధతిలో మార్పులు వస్తుంటాయి. కొత్తరకం ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. వాటిని అందిపుచ్చుకోవడం కోసం స్కిల్లింగ్‌ , రీస్కిల్లింగ్‌ అవసరం. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నతావకాశాలుంటాయి’’ అని మోదీ అన్నారు. డిజిటల్‌ మార్కెట్‌, వాణిజ్యం దిశగా భారత్‌ ముందుకెళ్తోందని తెలిపారు.’’సుపరిపాలన అంటే ప్రత్యర్థులను ఎదుర్కోవడం, ప్రమాదాలు రాకుండా చూసుకోవడం మాత్రమే కాదు. ఆవిష్కరణలు ప్రోత్సహించాలి. వాటిని ప్రపంచ ప్రయోజనాల కోసం అమలు చేయాలి’’ అని హితవు పలికారు. సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉంచేలా, ప్రజలు కేంద్రంగా అప్లికేషన్లు రూపొందించాలని పిలుపునిచ్చారు. అలాగే సైబర్‌ సెక్యూరిటీ, డీప్‌ఫేక్స్‌, తప్పుడు సమాచారం గురించిన ఆందోళనలను పరిష్కరించాలన్నారు.’’ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలను మెరుగుపర్చడం ద్వారా కోట్లమంది జీవితాలను మార్చడంలో ఏఐ సహాయపడుతుంది. ఇదంతా జరగాలంటే.. వనరులు, ప్రతిభ ఉన్న సమాజం కలిసి పనిచేయాలి. పారదర్శకతను పెంపొందించే ఓపెన్‌ సోర్స్‌ సిస్టమ్‌లను అభివృద్ధి చేయాలి. పక్షపాతం లేకుండా నాణ్యమైన డేటా సెట్టింగ్‌ ఉండాలి’’ అని అన్నారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు ఎలాంటి ఆంక్షలు లేని ఏఐ అందుబాటులో ఉండాలని సూచించారు.ఇదిలాఉండగా.. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఆరోసారి. అనంతరం 12వ తేదీ సాయంత్రానికి అమెరికాకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో భేటీ అవుతారు. ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భేటీ కానున్న ప్రధాని మోదీ.. ఈసందర్భంగా ఆయనతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. పలు దేశాలపై ట్రంప్‌ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

శిలాజేతర ఇంధన వినియోగంలో దూసుకెళ్తున్నాం

` సౌర ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపుతో మూడోదేశంగా గుర్తింపు

` ఇంధన వార్షికోత్సవాలను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢల్లీి(జనంసాక్షి):శిలాజేతర ఇంధన శక్తి ఉపయోగంలో భారతదేశం వాడుక మూడురెట్లు పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.  సౌర ఉత్పత్తి సామర్థ్యాన్ని డబుల్‌ చేసి మూడో అతిపెద్ద సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశంగా భారత్‌ నిలిచిందని మెచ్చుకున్నారు. భారత్‌ ఇంధన వార్షికోత్సవాలు 2025ను ప్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇండియా తన వృద్ధిని సాధించడంతో పాటు ప్రపంచ వృద్ధి రేటును నడిపిస్తోందని ప్రశంసించారు. ఇంధన రంగంలో భారత్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. 21వ శతాబ్దం భారత్‌దేనని ప్రపంచంలోని నిపుణులు చెబుతున్నారని, వనరులు, మేధో సంపత్తి, ఆర్థిక బలం, రాజకీయ స్థిరత్వం, ప్రపంచ సుస్థిరతపై భారత్‌కు నిబద్ధత ఉందని మోడీ స్పష్టం చేశారు. 2030 సంవత్సరం నాటికి జీరో కర్బన ఉద్గార లక్ష్యాన్ని పెట్టుకున్నామని, ప్రతి సంవత్సరం ఐదు మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. పారిస్‌ జి20 ఒప్పంద లక్ష్యాలను చేరుకున్న తొలి దేశం భారతేనని, రానున్న రెండు దశాబ్దాలు భారత దేశానికి అత్యంత కీలకమని ఆయన తెలియజేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యాక్షన్‌ కమిటీ సమావేశానికి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌, పిఎం మోడీ అధ్యక్షత వహిస్తున్నారు. ఫ్రాన్స్‌ పర్యటన అనంతరం మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మోడీ సమావేశం కానున్నారు.