ఏకపక్షంగా ఉపసర్పంచ్ ఎన్నిక
అయిదుగురు వార్డు సభ్యుల రాజీనామా
అవిశ్వాసం ప్రకటన
జగిత్యాల,జనవరి23(జనంసాక్షి): తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అసమ్మతి సెగలు మొదలయ్యాయి. ఉప సర్పంచ్ ఎన్నికతీరును నిరసిస్తూ రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామానికి చెందిన అయిదుగురు వార్డు సభ్యులు రాజీనామా చేయడం కలకలం రేపింది. దీనిపై దర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఆరా తీస్తున్నారు. ఉప సర్పంచి ఎన్నిక తీరుని నిరసిస్తూ వీరు ఎంపీడీవో కార్యాలయంలో తమ రాజీనామా లేఖలను అందజేశారు. చింతలూరు గ్రామంలో 664 మంది ఓటర్లు ఉండగా 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులలో ఒకటి ఏకగ్రీవం కాగా మరో ఏడు వార్డులకు, సర్పంచి స్థానానికి సోమవారం ఎన్నికలు నిర్వహించగా గ్రామానికి చెందిన అనుపురం శ్రీనివాస్ సర్పంచిగా గెలుపొందారు. ఉప సర్పంచిగా గ్రామానికి చెందిన డి.ప్రభాకర్‌ను ఎన్నుకున్నట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన వార్డు సభ్యులు తమ అనుమతి లేకుండానే ఉపసర్పంచి ఎన్నుకున్నారని ఆరోపించారు. ఎంపీడీవో రమేష్‌కు అవిశ్వాస తీర్మానంతో పాటు అయిదుగురు వార్డు సభ్యులు కడ రాజేందర్, ఎనుగంటి సరళ, మక్కల చిన్నక్క, అల్లాల అజయ్, ఓరుగంటి భూమరావుతమ రాజీనామాలు అందజేశారు. కోరం ఉన్న తమని సంప్రదించకుండానే ఇష్టానుసారం ఉపసర్పంచి ఎన్నిక చేశారని అన్నారు. అధికారులు ఉప సర్పంచి ఎన్నికపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. లేదంటే దీనిపై ఆందోళనకు కూడా వెనకాడమని చెప్పారు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.