ఏకపక్ష నిర్ణయాలతో చేటు

కెసిఆర్‌పై మండిపడ్డ చాడ
హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. రెవెన్యూ చట్టాలలో మార్పులపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య చాలా సమస్యలున్నాయని తెలిపారు. రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదా ఇంకా రూపొందించలేదన్నారు. రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. కొత్త మున్సిపల్‌ చట్టంలో రాజ్యాంగ సవరణల స్ఫూర్తి దెబ్బతిన్నదని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. రెవెన్యూ చట్టాన్ని ప్రజల మధ్య చర్చ పెట్టాలన్నారు. భూ సమస్యలను భిన్న కోణాల్లో చూడాలని కోదండరామ్‌ అన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన వల్ల చాలామంది ఆగమైపోయారని వివరించారు. కొత్త రెవెన్యూ చట్టంలో కోనేరు రంగారావు సూచనలు తీసుకోవాలని వెల్లడించారు. పోడు, అసైన్డ్‌, అటవీ భూములను దృష్టిపెట్టుకొని కొత్త చట్టం తేవాలని విజ్ఞప్తి చేశారు. సెలెక్ట్‌ కమిటీకి నివేదించి చర్చించిన తర్వాత చట్టం చేయాలన్నారు. లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ చేపడతామని హెచ్చరించారు.