ఏకాగ్రతకు నిదర్శనం ఏకలవ్యుడు

ఏకలవ్యుడు తాను గురువుగా భావించే ద్రోణుడి విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని విలువిద్య అభ్యసించాడు. అతడిది ఏక లక్ష్యం, ఏకాగ్ర చిత్తం. అసమాన శక్తిశాలి అయిన ఆచార్యుడే తనకు విద్య నేర్పుతున్నాడన్న భావన అతడికి కలిగేది. ఆ శిష్యుడి దృష్టిలో అది రాతి విగ్రహం కాదు…సజీవ రూపం. అస్త్రవిద్యను, అందులోని నియమాలను గురువే విశదీకరించి చెబుతున్నట్లు అనిపించేది. ఇతరులకు అది బొమ్మ కావచ్చు కానీ, ఏకలవ్యుడికి కాదు. అటువంటి దృష్టినే అలవరచుకున్నవారికి- ఆయా దృశ్యాలు జీవిత సత్యాల్ని, పాఠాల్ని నేర్పే గురువులవుతాయి. వారిలో అనూహ్యమైన మార్పు తెస్తాయి. ఆలోచనా పటిమను పెంచుతాయి.దృష్టి మనిషి దృక్పథాన్ని తెలియజేస్తూనే?- విషయాల పట్ల స్పష్టమైన, లోతైన అవగాహన కలిగిస్తుంది. ఓ పాత్రలోని సగం నీటిని చూసి, నిండా నీళ్లు లేవని అనుకోవచ్చు. సగం వరకైనా ఉన్నాయనీ భావించవచ్చు. వీటిలో మొదటిది నిరాశకు, రెండోది ఆశావాదానికి ప్రతీక. జీవితంపట్ల మనిషి ఆలోచనను ఇటువంటివే స్పష్టీకరిస్తాయి.దృష్టి వల్ల ఉద్దేశాలు తెలుస్తాయి. ఆలోచనలు అవగతమవుతాయి. చూసే తీరును బట్టి అంతా ఉంటుంది. నిశితంగా చూడగలగడం ఓ నేర్పు! జీవితాన్ని ఆకళింపు చేసుకొనే పద్ధతి అది. ఇతరులపై అంచనాలు, వారివిూద అభిప్రాయాల్ని దృష్టే చెబుతుంది. అదే సంబంధ బాంధవ్యాల విధానాన్ని వెల్లడిస్తుంది.
——————