ఏకాభిప్రాయానికి కృషి చేస్తాం

– రాష్ట్రపతి అభ్యర్థిపై మొదలైన కసరత్తు

న్యూఢిల్లీ,జూన్‌ 13(జనంసాక్షి): రాష్ట్రపతి అభ్యర్థిపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. సోమవారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అభ్యర్థి ఎంపిక కోసం రంగంలోకి దిగారు. మంగళవారం వెంకయ్యనాయుడితో ఆయన నివాసంలోనే అమిత్‌ షా భేటీ అయ్యారు. జైట్లీతోనూ సమావేశమైన అమిత్‌షా రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ సమాలోచనలు జరపనునున్నారు. ఈ సందర్భంగా త్రి సభ్య కమిటీ సభ్యులకు ఎంపికలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే త్రిసభ్యు కమిటీ వేర్వేరు పార్టీలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయనుంది. ఈ కమిటీ వివిధ పార్టీలతో చర్చలు జరిపిన తర్వాత అభ్యర్థి ఎంపికపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షా త్రిసభ్య కమిటీ సభ్యులతో సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిపై బీజేపీ రంగంలోకి దిగడంతో యూపీఏ, విపక్షాలు అప్రమత్తమత్తమయ్యాయి. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు విపక్ష పార్టీలు బుధవారం ఢిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే తమకు అనుకూలమైన అభ్యర్థిని ఎంపిక చేస్తే పోటీగా యూపీఏ, విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తున్నాయి. దీంతో అర్హుల పేర్లపై ఆసక్తి పెరుగుతుంది. విపక్ష కూటమి తరఫున గాంధీ మనుమడు, బంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ, లోక్‌సభ మాజీ స్పీకర్‌ విూరాకుమార్‌, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ తదితరుల పేర్లు చర్చల్లో ఉన్నాయి.