ఏకీకృత విద్య అమలుకు కేంద్రం ముందుకు రావాలి
ఎంబిబిఎస్, బిడిఎస్ లాంటి ఉన్నత వైద్యవిద్యను అభ్యసించాలంటే ఇకపై జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాయాల్సిందేనని సుప్రీంకోర్టు తన తుది తీర్పులో తేల్చి చెప్పడం ద్వారా ఏకీకృత వైద్యవిద్యకు ఓ రకంగా పునాది పడిందనే చెప్పాలి. ఓకే విద్యకు వివిధ రాష్టాల్ల్రో వివిధ రకాలు పరీక్షలు ఉండడం వల్ల విద్యారంగంలో విపరీత పోకడలు సాగాయి. ఇప్పుడు సుప్రీం ఖరాఖండిగా దీనిపై తన తుదితీర్పుకు లోబడి ఉండాల్సిందేనని ఆదేశించడంతో నీట్ తప్పనిసరి కానుంది. వైద్యవృత్తిలో ప్రవేశించేందుకు శ్రమించే విద్యార్థులు, ఏటా దేశంలో నిర్వహించే 28 రకాల ప్రవేశ పరీక్షలకు హాజరు కానక్కర్లేకుండా చూడాలన్న సదాశయమే 2009నాటి ఎంసీఐ నిర్ణయానికి పునాది వేసేలా సుప్రీం తీర్పు ఉంది. అనేక దరఖాస్తులు నింపి, రుసుములు కట్టి, వ్యయప్రయాసలకోర్చి, వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షలు రాయాల్సిరావడం ఎంతటివారికైనా తలకు మించిన భారం. ఈ గందరగోళం నుంచి విద్యార్థులను కాపాడేందుకంటూ తెరవిూదకు వచ్చిన నీట్‌ను అప్పటి యూపీఏ సర్కారు సూతప్రాయంగా ఆమోదించినా, కొన్ని రాష్టాల్ర అభ్యంతరాలతో వెనకంజ వేసింది. ఆపై వివాదాస్పద తీర్పు పునస్సవిూక్షకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తపరచినా, కేంద్రంలో అధికారం చేతులు మారాకనే- రాజ్యాంగ ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ కళాశాలలు, డీమ్డ్ యూనివర్శిటీలు ఇలా ఎవరికి వారు ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవడం ఇకపై కుదరదని కూడా తేల్చి చెప్పింది. మైనారిటీ విద్యాసంస్థలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇంతకాలం ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా పరీక్షలు నిర్వహించుకుని ఓ రకంగా విద్యార్థలకు నష్టం కలిగిస్తూ వచ్చాయి. జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్షకు అను మతిస్తూ ఏప్రిల్ 28 తాము ఇచ్చిన తీర్పును ఏమాత్రం మార్చేది లేదని సుప్రీం స్పష్టం చేయడంతో ఇక జులైలో రెండో విడత ప్రవేశ పరీక్షకు అంతా సిద్దం కావాల్సి ఉంటుంది. నీట్‌కు అనుమతిస్తూ తాము ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వేసిన పిటిషన్లను సుప్రీం కొట్టేసింది. ఏప్రిల్ 28న తాము ఇచ్చిన తీర్పును తూచా తప్పుకుండా పాటించాల్సిందే అని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. దీంతో మెడికల్ వైద్యవిద్యకు సంబంధించి ఏకీకృత ప్రవేశ పరీక్షకు తొలి అడుగు పడిందనే చెప్పాలి. నిజంగా ఇది విద్యార్థులకు మేలు చేసేదిగా ఉంటుందనడంలో సందేహం లేదు. అలాగే జాతీయ స్థాయిలో కూడా వైద్యవిద్యకు గుర్తింపు రాగలదు. అలాగే పరీక్షలను కూడా జాతీయ స్థాయిలో నిర్వహిస్తే మరీ మంచిది. ఏడేళ్ల క్రితం భారత వైద్యమండలి(ఎంసీఐ) నోట తొలుత నీట్ ప్రతిపాదన వెలువడింది మొదలు విధ రాష్టాల్రు ఆంగ్లంలోనే పరీక్ష నిర్వహణ యోచనను తప్పుపడుతూ వచ్చాయి. వైద్యవిద్య విషయంలో ప్రాంతీయభాషల్లో పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనే సరికాదు. ప్రైవేటు కళాశాలలు, సంఘాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించుకునే వీల్లేదని సుప్రీం తనతీర్పులో స్పష్టీకరించి ఓ రకంగా విద్యావ్యాపారానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది.దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల బోధన, పాఠ్యాంశాల కూర్పు ఒకేవిధంగా ఉన్నప్పుడు ప్రవేశ పరీక్షలోనూ ఏకరూపత పాటించడమే సరైన పద్ధతి. ఈ వాస్తవిక స్ఫూర్తికే సర్వోన్నత న్యాయస్థానం తన తుదితీర్పు ద్వారా మరోమారు స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ దిశగా ఇప్పటికైన ఏకీకృత విద్యావిధానానికి దీనిని అవకాశంగా తీసుకుని ముందుకు రావాలి. అయితే విద్యార్థు ల సౌకర్యార్థం నీట్ పరీక్షల తేదీల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని సూచించింది. మే 1న నీట్ ప్రవేశ పరీక్షకు హాజరు కాలేని విద్యార్థులు జులై 24న నిర్వహించనున్న నీట్ రెండోదఫా పరీక్షకు హాజరుకావచ్చని స్పష్టం చేసింది. అయితే మొదటి దఫాలో పరీక్షలు రాసిన విద్యార్థులు మొదటి పరీక్షలో తమ అభ్యర్థిత్వాన్ని వదులుకుంటనే రెండోసారి అవకాశం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల సౌకర్యార్థం రెండో దఫా పరీక్షల తేదీలను మార్చుకోవచ్చని కేంద్ర ప్రభుత్వానికి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సూచించింది. తమ ఆధీనంలోని యూనివర్సీటీల ద్వారా వైద్య విద్యలో ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు వీలుగా చేసే చట్టాలు చెల్లవని కూడా సుప్రీం స్పష్టం చేసింది. విద్యార్థులకు నష్టం కలగకుండా ప్రవేశ పరీక్షల ఏర్పాట్లు ఏ మేరకు జరుగుతు న్నాయో పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా నేతృత్వంలో ప్యానల్‌ను నియమిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. మొత్తంగా ఓ విప్లవాత్మక నిర్నయానికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. కేంద్రం చట్టం ద్వారా చేయాల్సిన పనిని సుప్రీం చేసింది. వైద్యవిద్యా కోర్సులో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)పై తాజా తీర్పుతో కొన్నాళ్లుగా ఈ అంశం చుట్టూ ఆవరించిన గందరగోళం తొలగింది. లక్షలాది తల్లిదండ్రులు, విద్యార్థుల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది.ఆరునూరైనా ఈ ఏడాదే జాతీయ అర్హత ప్రవేశ పరీక్షను నిర్వహించాలన్నది ధర్మాసనం సంకల్పం. పాఠ్యప్రణాళికల విషయంలో ఏకరూపత తేవడానికి కేంద్రం ముందుకు రావాలి. దేశవ్యాప్తంగా ఇంటర్ స్థాయిలో ఒకే తరహా పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టేందుకు కేంద్రం చొరవ తీసుకుంటే దేశవ్యాప్తంగా ఏకీకృత విద్యకు సాకారం చుట్టినవారం అవుతాం. ఇక ఇప్పుడునిర్ణయం కేంద్రానిదే. కేంద్రం విద్యారంగంలో ఓ విపవాత్మక నిర్ణయానికి ముందుకు రావాల్సిన తరుణం వచ్చింది.