ఏడాది చివరికి మంచినీళ్లు

C
– కార్యాచరణ దిశగా కదలండి

– మిషన్‌ భగీరధపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి): ప్రతిపాదిత గ్రామాలకు ఈ యేడాది చివరిలోగా మిషన్‌ భగీరథ కింద మంచినీరు అందేలా చూడాలిన సిఎం కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. ఎక్కడా రాజీపడకుండా పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు మంచినీరు సరఫరా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ ఏడాది చివరి నాటికే చాలా గ్రామాలకు మంచినీళ్లు అందించే విధంగా కార్యాచరణ రూపొందించుకొని వేగంగా పనులు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. జెన్‌కో, ట్రాన్స్‌కోలతో సమన్వయం కుదుర్చుకుని పంప్‌హౌజ్‌, పైప్‌లైన్లు, ఎలక్టో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 2016 ఏప్రిల్‌ నాటికి తొమ్మిది నియోజకవర్గాలకు మంచి నీరు అందించడానికి జరుగుతున్న పనులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మిషన్‌ భగీరథ పనులను వేగవంతం చేయాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. ఈ ఏడాది ఆఖరికి వీలైనంత ఎక్కువ గ్రామాలకు మంచినీరు అందించాలని సూచించారు. ఏప్రిల్‌ నాటికి 9 నియోజకవర్గాల్లో మంచినీరు అందేలా చూడాలన్నారు. అయితే ప్రస్తుతం జరిగిన పనులపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్‌ శాఖ అధికారులు మిషన్‌ భగీరథలో కనీసం పది రోజులైనా పాల్గొనాలని ఆదేశాలు జారీచేశారు. రైతుల పొలాల ద్వారా వెళ్లే పైపులైన్ల నిర్మాణం జూన్‌లోగా పూర్తి చేయాలన్నారు. పైపులైన్ల నాణ్యతతో ఉండాలని… రోగ కారకమైన సిమెంట్‌ పైపులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదని ఆదేశించారు. ఇంజినీరింగ్‌ పనుల్లో సాంకేతిక విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పైపులైన్ల నిర్మాణానికి తవ్వే కందకాలను ఉపాధిహావిూ పథకం కింద చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మిషన్‌ భగీరథ కోసం అవసరమైన మేర సిబ్బందిని నియమించు కోవచ్చన్నారు. పనులు పూర్తయిన తర్వాత కూడా నిర్వహణ బాధ్యత గుత్తేదారులదేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘంగా సవిూక్ష నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, ప్రజారోగ్య శాఖ అధికారులతో సవివరంగా చర్చించారు. ఎంసీహెచ్‌ఆర్డీలో సుమారు నాలుగున్నర గంటలపాటు మిషన్‌ భగీరథపై చర్చించిన సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సవిూక్ష ముగింపు సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా చేపట్టే పైప్‌లైన్‌ ఫిట్టింగ్‌, కనెక్టింగ్‌ పనులు చేసే అవకాశం గ్రామాల్లో ఉండే ఐటీఐ పూర్తి చేసిన ఫిట్టర్లకు ఇవ్వాలన్నారు. మంత్రులు, కలెక్టర్లు మండలాల వారీగా ఐటీఐ పూర్తి చేసిన వారి వివరాలు తీసుకొని స్థానికంగా జరిగే పనుల్లో ఉపాధి లభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిజైన్ల రూపకల్పనలో మరింత వేగం అవసరమన్నారు. పాత మున్సిపాలిటీల్లో పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌, కొత్త మున్సిపాలిటీల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మిషన్‌ భగీరథ పనుల పర్యవేక్షణ చూడాలన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మిషన్‌ భగీరథ పైప్‌లైన్ల ద్వారానే బల్క్‌ వాటర్‌ సరఫరా చేయాలి. 2016 చివరి నాటికి పూర్తయ్యే పనులకు సంబంధించిన డిజైన్లను వచ్చే నెలాఖరు

నాటికి ఖరారు చేయాలని సూచించారు. 2017లో పనులకు కావాల్సిన మెటీరియల్‌ కోసం ఇప్పుడే ఆర్డర్‌ ఇవ్వాలన్నారు. వాటర్‌ ట్రీట్‌మెంట్లు పూర్తి అయిన వెంటనే అక్కడి ప్రాంతాలకు మంచినీటి సరఫరా జరిగేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. అన్ని పనులు సమాంతరంగా జరగాలని చెప్పారు. డిజైన్లు, అనుమతులు ఇవ్వడంలో జాప్యం నివారించాలని పేర్కొన్నారు. అవాంతరాలను తొలగించడానికి ముఖ్యమంత్రి కార్యాలయమే జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. నాణ్యతతో కూడిన పైపులను మాత్రమే వాడాలన్నారు. పైప్‌లు, వాల్వ్‌లు సకాలంలో అందుబాటులోకి వచ్చేందుకు వ్యూహం రూపొందించాలన్నారు. తెలంగాణకు చెందిన సంస్థలు పైప్‌లు, వాల్వ్‌లు అందించే స్థితిలో లేకుంటే దేశంలోని ఉత్తమమైన సంస్థలకు పనులు ఇవ్వాలన్నారు. ఇన్‌టెక్‌ వెల్‌, డబ్ల్యూటీపీలతో పాటు గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం కూడా వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.  మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటి పంపింగ్‌ కోసం అవసరమయ్యే విద్యుత్‌ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, పవర్‌లైన్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మిషన్‌ భగీరథ పనులు పూర్తి అయిన తర్వాత వచ్చే ఐదేండ్ల పాటు నిర్వహణ బాధ్యత వర్కింగ్‌ ఏజెన్సీలకే ఉంటుందని స్పష్టం చేశారు. నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేసిన వారికిచ్చే 1.5 ఇన్సెంటీవ్‌ను అన్ని వర్కింగ్‌ ఏజెన్సీలు అందుకునేలా ప్రయత్నం చేయాలన్నారు. ఇంజినీరింగ్‌ పనుల్లో సాంకేతిక విద్య అభ్యసించిన విద్యార్థులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇందులో మంత్రి జగదీశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.