‘ఏడుగురు అమెరికా సైనికులను చంపేసిన కిమ్ జాంగ్ ఉన్’

వాషింగ్టన్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏడుగురు అమెరికా సైనికులను చంపేశాడని ఉత్తరకొరియా అధికార మీడియా అరిరేంజ్ మేరి ప్రకటించింది. ఒక అమెరికా సబ్‌మెరెన్‌పై ఉత్తరకొరియా సైన్యం  జరిపిన దాడిలో ఆ ఏడుగురు అమెరికా సైనికులను కిమ్ చంపేశాడని అరిరేంజ్ తెలిపింది. అయితే కిమ్ చంపింది అమెరికా సైనికులనే కానీ, నిజమైన వారిని కాదు. ‘హంటింగ్ యాంకీ’ అనే 3డీ గేమ్ లాంచింగ్ సందర్భంగా కిమ్ స్వయంగా గేమ్ ఆడారని అందులో ఒక అమెరికా సబ్‌మెరెన్‌ను ఆయన ధ్వంసం చేశారని చెబుతోంది. దాంతో అందులో ఉన్న ఏడుగురు సైనికులను కిమ్ అంతమొందించారంది.

ఉత్తరకొరియా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు ఉత్తరకొరియాకు చెందిన ఒక సంస్థ ఈ గేమ్‌ను రూపొందించింది. నిజంగా అమెరికా సైనికులను చంపుతున్న భావనను ప్రజలకు కలిగించి వారిలో దైర్యాన్ని నింపేందుకు ఈ ప్రయత్నం చేశామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఈ గేమ్‌ రూపొందించడంపై అమెరికా మండిపడింది. అమాయకులైన ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టొద్దని అలాంటి ప్రయత్నాలు వెంటనే మానుకోవాలని అమెరికా హితవు పలికింది.