ఏదయా..? మీదయ!

4

– రైల్వే శాఖ నిర్లక్ష్యంపై తెలంగాణ ఎంపీల ఆగ్రహం

హైదరాబాద్‌,జనవరి 6(జనంసాక్షి): తెలంగాణలో ఉన్న పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర్రానికి చెందిన ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ రవీంద్ర గుప్తా బుధవారం  సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం రైల్వే జీఎం మాట్లాడుతూ వివిధ ప్రాజెక్టులపై తెలంగాణ ఎంపిలు సూచనలు చేశారని అన్నారు. కొత్త రైళ్లు, రైల్వే వంతెనలు నిర్మాంచాలని ఎంపీలు కోరారని దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా తెలిపారు.  ఎంపీల ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపిస్తామని తెలిపారు. అదేవిధంగా పెండింగ్‌ ప్రాజెక్టులు నిర్ణీత వ్యవధిలో పూర్తిచేస్తామని వెల్లడించారు.  రానున్న రైల్వే బడ్జెట్లో తెలంగాణ ప్రాంతంలో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు ట్రిపుల్‌ రైల్వే లైన్‌ వేయాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ కోరారు. ఆలంపూర్‌ జోగులాంబ ఆలయం వద్ద స్టేషన్‌ ఏర్పాటుచేయాలని నాగర్‌ కర్నూల్‌ ఎంపి నంది ఎల్లయ్య కోరారు. గత ఏడాది కూడా ఇలాగే సమావేశం పెట్టినా, అభివృద్ధి ఏమాత్రం జరగలేదని మరో ఎంపీ మల్లారెడ్డి మండిపడ్డారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో  సౌకర్యాలు మెరుగుపరచాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక దక్షిణ మధ్య రైల్వేపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై ఎంపీలు తమ సలహాలు, సూచనలు అందించారు. ప్రతి ఏటా ఈ తరహాలో రైల్వే బడ్జెట్‌కు  ప్రతిపాదనలు పంపడానికి ముందుగా ప్రజాప్రతినిధులతో రైల్వే అధికారులు భేటీ కావడం తెలిసిందే. అనంతరం ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు జీ నగేశ్‌ మాట్లాడుతూ…గ్రూప్‌-డీ ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని, కొత్త లైన్లు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం-మణుగూరు రైల్వే లైన్‌ను వేగంగా పూర్తి చేయాలన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు బాల్క సుమన్‌ విూడియాతో మాట్లాడారు. ప్రతీ బడ్జెట్‌లో నియోజకవర్గానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆశపడుతాం. ప్రతీ సారి తెలంగాణను కేంద్రం నిరాశకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది బడ్జెట్‌ కోసం 20 ప్రపోజల్స్‌ ఇస్తే 4 పనుల బోర్డుకు పంపారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సర్వే కోసం రూ.10 లక్షలు కేటాయించి చేతులు దులుపుకొందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల పేరిట ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకుంటామని జీఎం హావిూ ఇచ్చారు. తప్పుడు కుల ధృవపత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీలు వినోద్‌, జితేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ…పెండింగ్‌ ప్రాజెక్టులను జూన్‌ 2 లోగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. పెద్దపల్లి-నిజామాబాద్‌ ప్రాజెక్టు 25 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది. పెండింగ్‌ ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయాలి. కరీంనగర్‌ నుంచి ముంబై వరకు కొత్త రైలు వేయాలన్నారు. . మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనులను ఆర్‌వీఎస్‌ఎల్‌కు అప్పగించడం సరికాదని జితేందర్‌ రెడ్డి అన్నారు.. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలి. అన్ని పనులను రైల్వే బోర్డు చూస్తే ఈ సమావేశం ఎందుకు నిర్వహించారని ఎంపీలు ప్రశ్నించారు. నగరంలో రద్దీని తగ్గించేందుకు శివార్లలో నాలుగు టెర్మినల్స్‌ నిర్మించాలన్నారు.