ఏపీ అభివృద్ధికి.. కేంద్రం చేయూత అవసరం

– నాలుగున్నరేళ్లలో విభజన సమస్యలు పరిష్కారం కాలేదు
– ¬దా ఇవ్వకూడదని కేంద్ర నిర్ణయం అభివృద్ధికి ప్రధాన విరోధం
– ‘ఇబ్బందులున్నా ‘సంక్షేమం’ కొనసాగిస్తున్నాం’
– రాష్ట్ర నాయకత్వంతో కష్టాల నుంచి గట్టెక్కాం
– 2029నాటికి ఏపీ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా అవతరిస్తుంది
– కొత్తగా 32లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చాం
– రాష్ట్రాన్ని కరువురహిత ప్రాంతంగా మార్చుతున్నాం
– నదుల అనుసంధానం పనులు వేగంగా సాగుతున్నాయి
– పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
– 2019 చివరి నాటికి పోలవరాన్ని పూర్తిచేస్తాం
– త్వరలో రెండు విడతల్లో రుణమాఫీ చేస్తాం
– సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
– ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లను రెట్టింపు చేశాం
– ఏపీ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ నర్సింహన్‌
అమరావతి, జనవరి30(జ‌నంసాక్షి) : పొరుగు రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి ఏపీ చేరే వరకూ కేంద్రం చేయూత అవసరమని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. నాలుగున్నరేళ్లలో విభజన సమస్యలు పరిష్కారంలో కేంద్రం శ్రద్దచూపకపోయినా.. స్వశక్తితో విభజన నష్టాల నుంచి ఏపీ కోలుకుని అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు. బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఆయన ఉభయసభలనుద్దేశించి 56నిమిషాల పాటు ప్రసంగించారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చిన రూ.350కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం ఊహించని పరిణామమని ఆయన అన్నారు.
విభజన చట్టంలోని చాలా హావిూలను కేంద్రం ఇంకా నెరవేర్చలేదని, కేంద్రం నిధులపై రాష్ట్రం సమర్పించిన వినియోగపత్రాలను నీతి ఆయోగ్‌ ధ్రువీకరించిందని చెప్పారు. ప్రత్యేక¬దా ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన విరోధమన్నారు. విభజన కారణంగా ఆర్థిక, ఇతర వనరులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడినా.. రాష్ట్ర నాయకత్వం వల్ల కష్టాల నుంచి గట్టెక్కామని చెప్పారు. పింఛన్ల కోసం రూ.14వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధప్రదేశే అని గవర్నర్‌ వివరించారు. కేంద్రం సహాయ నిరాకరణకు పాల్పడుతూ తోడ్పాటు అందించడం లేదని.. సహకరించకపోయినా ఆదర్శంగా నిలవడం ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని చెప్పారు. టెక్నాలజీ సాయంతో సేవల్ని ప్రజలకు చేరువ చేస్తున్నామని, రాబోయే ఐదేళ్లకు సంపృత్త స్థాయి విజన్‌ రూపొందించామని ఆయన తెలిపారు. 2029 నాటికి ఏపీ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా అవతరిస్తుందని గవర్నర్‌ చెప్పారు. 90శాతం రాయితీతో పనిముట్లు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఎన్టీఆర్‌ భరోసా కింద ఫించన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి రూ. 2 వేలు ఇస్తామని, ఈ పథకం కింద 2014-15 నుంచి 2018-19 వరకు రూ.24,618.39 కోట్లు పంపిణీ చేశామని గవర్నర్‌ నరసింహన్‌ వివరించారు. 11బీసీల కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. 8బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చనున్నామని నరసింహన్‌
వివరించారు. రూరల్‌, అర్బన్‌ హౌసింగ్‌ స్కీమ్‌ అమలు చేస్తున్నాం. పసుపు-కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ఇస్తున్నాం, రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నామని తెలిపారు. త్వరలోనే రెండు విడతల్లో రుణమాఫీకి చర్యలు తీసుకుంటామని, రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా తయారుచేస్తున్నామని అన్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇప్పటికే పోలవరం 60శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. ఇటీవల పోలవరం ప్రాజెక్ట్‌కు గిన్నిస్‌ అవార్డు వచ్చిందని గవర్నర్‌ గుర్తు చేశారు.  నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు గవర్నర్‌ పేర్కొన్నారు. నదుల అనుసంధానం పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  ‘సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 11శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే ప్రముఖ ప్రాంతంగా ఏపీ ఉందని తెలిపారు. ఆదరణ పథకం కింద వృత్తిదారులకు పరికరాలు ఇస్తున్నామని గవర్నర్‌ చెప్పారు. టోలు, ట్రాక్టర్లకు పన్నుమినహాయింపునిచ్చామని, నాలుగున్నరేళ్లలో విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. ఏపీ విభజన అసంబద్ధంగా జరిగిందన్నారు. విభజన కారణంగా ఏపీ ఎంతో నష్టపోయిందని, ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక ¬దా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఏపీ అభివృద్ధిపై ఇది తీవ్ర ప్రభావం చూపిందని, కేంద్ర మద్దతు లేకపోయినా అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని గవర్నర్‌ వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. 10శాతం ఈడబ్ల్యూఎస్‌లో 5శాతం కాపులకు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అనేక బీసీ ఫెడరేషన్లకు కార్పొరేషన్లుగా మారుస్తామని, ఆకస్మిక మరణాలతో ఆప్తులను కోల్పోయినవారికి చేయూతనిస్తున్నామని నరసింహన్‌ తెలిపారు.
32లక్షల ఎకరాలు సాగులోకి..
రాష్ట్ర ప్రభుత్వం వయాడక్ట్‌ విధానం ద్వారా ఆర్థిక పురోగతిని సాధించేందుకు కృషి చేస్తోందని.. నాలుగున్నరేళ్లలో అవినీతి రహిత, పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నరసింహన్‌ చెప్పారు. సాగునీటికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి ఈ నాలుగున్నరేళ్లలో రూ.64,333 కోట్లు ఖర్చు చేసిందని.. దీంతో 32 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.15,585కోట్లు ఖర్చు చేశామన్నారు. 2019 చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంతో నీటి కొరతను అధిగమించామని.. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో 263 టీఎంసీల నీటిని డెల్టాకు మళ్లించామని గవర్నర్‌ తెలిపారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం సమావేశాలు గురువారంకు వాయిదాపడ్డాయి. దాదాపు 56 నిమిషాల పాటు గవర్నర్‌ ప్రసంగం కొనసాగింది. 99 అంశాలపై 40 పేజీల ప్రసంగాన్ని గవర్నర్‌ చదివి వినిపించారు. అంతకు ముందు జాతిపిత మహాత్మాగాంధీకి శాసనమండలి, శాసనసభ సభ్యులు నివాళులర్పించారు.