ఏపీ గవర్నర్‌గా.. విశ్వభూషణ్‌ ప్రమాణస్వీకారం


– ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌
– గవర్నర్‌కు ఘనస్వాగతం పలికిన సీఎం జగన్‌, మంత్రులు
– గవర్నర్‌ను కలవకుండానే వెనుదిరిగి వెళ్లిన చంద్రబాబు
– నేడు ప్రత్యేకంగా కలుస్తారంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు
అమరావతి, జులై24(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ఆయన చేత రాజ్‌భవన్‌ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్‌ను కలవకుండానే వెనుదిరిగిపోయారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసొచ్చిన ఆయన వెనుదిరిగి వెళ్లారు. కాగా గురువారం ప్రత్యేకంగా కలిసేందుకు అపాయింట్‌ మెట్‌ తీసుకున్నట్లు ఆపార్టీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. మరోవైపు మంగళవారం సాయంత్రమే కొత్త గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. సాయుధదళాల గౌరవవందనం అందుకున్న ఆయనకు తర్వాత ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. సీఎస్‌ ఎల్వీ సబ్రమణ్యం, గవర్నర్‌ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ విూనా, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌  ద్వారకాతిరుమలరావు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా నరసింహన్‌ వ్యవహరించారు. తాజాగా ఆంధప్రదేశ్‌ గవర్నర్‌గా ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 1934 ఆగస్టు 3న రాజకుటుంబంలో జన్మించారు. ఆర్థిక శాస్త్రంలో పీజీ డిగ్రీ పూర్తి చేశారు. 1971లో భారతీయ జనసంఘ్‌లో చేరారు. ఆయనకు భారతీయ జనతాపార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 1980లో భాజపా ఒడిశా అధ్యక్షుడిగా, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బిశ్వభూషణ్‌ సేవలందించారు. ఎమ్జ్గం/న్సీ వ్యతిరేక పోరాటంలో విూసా చట్టం కింద అరెస్టయ్యారు. ఇందిరాగాంధీ పాలనపై ఒడిశా హైకోర్టు లాయర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1977లో ఇందిరకు వ్యతిరేకంగా ఒడిశాలో ప్రచారం నిర్వహించారు. 1990లో బిజూ పట్నాయక్‌ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 1996లో ఒడిశా బీజేఎల్పీ నేతగా బాధ్యతలు చేపట్టారు. భాజపా,బీజేడీ ఉమ్మడి ప్రభుత్వంలోనూ మంత్రిగా కొనసాగారు.