ఏపీ ప్రజలకు..  చంద్రబాబు ద్రోహంచేశారు!


– ఆయన వల్ల ఏపీకి తీరని నష్టం చేకూరింది
– చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం భాగస్వామ్యం కాలేము
– దేవినేని ఓ అబద్దాన్ని 10సార్లు చెబుతున్నాడు
– పోతిరెడ్డిపాడుకు వ్యతిరేఖంగా ఆయన ధర్నాకు దిగాడు
– ఏపీ సీఎంకు కాంగ్రెస్‌ నేత కేవీపీ బహిరంగ లేఖ
అమరావతి, మే4(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు కారణంగానే ఏపీకి తీరని నష్టం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రారావు విమర్శించారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు శనివారం బహిరంగ లేఖ రాశారు. తన వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు బీజేపీతో లాలూచీ పడ్డారని విమర్శించారు. ఎన్నికల ముందు బీజేపీతో గొడవలు పెట్టుకుని రాష్ట్రానికి మరికొంత నష్టం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ విభజన తర్వాత ప్రజలు అధికారం అప్పగిస్తే, వారందరికీ చంద్రబాబు ద్రోహం చేశారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్రమే చేపడుతుందని విభజన చట్టంలోనే ఉందని కేవీపీ గుర్తుచేశారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయనతో భాగస్వామ్యం కాలేమని కేవీపీ రామచంద్రారావు స్పష్టం చేశారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓ అబద్ధాన్ని 10సార్లు చెప్పి నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేవీపీ మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీని కట్టడానికి వీల్లేదని, కాళ్లకు గుడ్డలు కట్టుకుని ఉమ సత్యాగ్రహం చేశారని ఆరోపించారు. ఇప్పటివరకూ తాను దేవినేని ఉమ పేరును ప్రస్తావించలేదనీ, విూడియా మిత్రులు ఈరోజు తన చేత చెప్పించారని వ్యాఖ్యానించారు. అప్పట్లో పోలవరం కాలువల నిర్మాణం జరగకుండా టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ నేతలే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 1985 నుంచి చంద్రబాబు నాయుడు అనేవ్యక్తి ఒక్కరోజు అయినా పోలవరం ప్రాజెక్టును చూసేందుకు, ప్రాజెక్టు స్థలానికి వెళ్లాడా అని కేవీపీ ప్రశ్నించారు. నేను ఆరుసార్లు కాలినడకన అక్కడకు వెళ్లానని, వ్యక్తిగతంగా రైతుల దగ్గరకు వెళ్లి ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పానని అన్నారు. స్టేలు తీసుకురావద్దని రైతులను కోరానని, అలా ప్రాజెక్టు కోసం నేను కష్టపడుతుంటే మరోవైపు టీడీపీ నేతలు వందలాది కోట్లను అడ్డగోలుగా దోచేసి రామచంద్రరావు రైతులకు అన్యాయం చేశాడని చెబుతున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రబుద్ధులా నన్ను పోలవరం గురించి ప్రశ్నించేది అంటూ మండిపడ్డారు. వీళ్ల మొఖానికి అసలు ఓ సిగ్గుందా అని కేవీపీ విమర్శల వర్షం కురిపించారు.