ఏపీ సీఎం జగన్ బొమ్మతో వినూత్నంగా నిరసన
అమరావతి : విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అప్పుల కోసం ప్రభుత్వ స్థలాలు కుదువపెట్టొద్దని జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద టీడీపీ, జనసేన, సీపీఎం కార్పొరేటర్లు నిరసన తెలిపారు. చెత్త పన్నుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే విశాఖ నగరంలో ఉన్న పాలిటెక్నిక్, ఐటీఐ, రిషికొండ, రాజీవ్ గృహ కల్ప, రైతుబజార్, తహసీల్ కార్యాలయాలో ఆస్తులను తాకట్టు పెట్టిన ప్రభుత్వం ఇక జీవీఎంసీ ఆస్తులపై కన్నేసిందని విమర్శించారు.
స్వర్ణభారతి స్టేడియం, జీవీఎంసీ కార్యాలయం, పార్కు స్థలాలు కూడా త్వరలో తాకట్టు పెట్టనుందని ఆరోపించారు. జీవీఎంసీకి ఆస్తుల పెంపుదల చేయాల్సిందిపోయి కుదువ పెట్టడం దారుణమని నాయకులు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీపీఎం కార్పొరేటర్ గంగారాం ఏపీ సీఎం జగన్ బొమ్మతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఇప్పటికే ఆస్తులు కుదువపెట్టి నగరంలో రూ.200 కోట్లు అప్పు తీసుకొచ్చారని గంగారాం ఆరోపించారు.