ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు
హైదరాబాద్: తెలంగాణలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ముసాయిదా విద్యాసంవత్సర ప్రణాళిక (అకడమిక్ కేలండర్)ను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. 2017-18 విద్యాసంవత్సరాన్ని మార్చి 21 నుంచి ప్రారంభించి, ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు నూతన విద్యాసంవత్సర ముసాయిదా కేలండర్‌ను ఉపాధ్యాయ సంఘాలకు పంపించింది. ఈ ప్రణాళికపై ఆయా సంఘాలతో చర్చించి, మార్పుచేర్పులతో ఖరారు చేయనుంది. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలల్ని తిరిగి ప్రారంభించనుంది. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉదయం 9.30 గంటలకు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి ప్రారంభించాలని ప్రతిపాదించింది. పాఠశాలసముదాయ (స్కూల్ కాంప్లెక్స్) సమావేశాలు జులై, ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరుగుతాయి. పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలను 2018 ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు లేదా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6 వరకు నిర్వహించాలని సూచించింది.