ఏమైంది..మునగాలకు..!

 వరుస ప్రమాదాల దృష్ట్యా ప్రజల్లో భయం
– కారు బైక్ ఢీ, ముగ్గురికి తీవ్ర గాయాలు
– సబ్ స్టేషన్ వద్ద వడ్ల ట్రాక్టర్ బోల్తా

మునగాల, నవంబర్ 15(జనంసాక్షి): మునగాల మండల కేంద్రంలో ఇటీవల జరుగుచున్న వరుస ప్రమాదాలకు ప్రజల్లో భయం ఏర్పడింది. మునగాలకు ఏమైంది అనే విషయంలో ప్రజలు భయకంపితులవుతున్నారు. వరుస ప్రమాదాలకు కారణం ఎవరు అనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. గత శనివారం రాత్రి జరిగిన భారీ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించగా 15 మందికి పైగా తీవ్ర గాయాలు పాలైన విషయం విధితమే. ఆ విషాదం ఇంకా తీరకముందే మంగళవారం ఉదయం మునగాల శివారులోని పిచ్చయ్య హోటల్ వద్ద ఓ కారు అతివేగంతో వచ్చి ఉదయాన్నే సుతారీఖులి పనులకు బైక్ పై వెళ్తున్న వ్యక్తులను ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. మునగాల శివారులోని బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన కాలే కమలమ్మ, పూజ దేవులు, వేట గోపిలు అనుదిన మాదిరిగానే మంగళవారం ఉదయం సుతారి పనికి వెళ్లే నిమిత్తం బైక్ పై వెళుతున్న తరుణంలో మునగాల శివారులోని పిచ్చయ్య హోటల్ వద్ద వెనుక నుండి అతివేగంతో వస్తున్న కారు బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే కింద పడిపోయారు. తీవ్ర గాయాల పాలై రక్తస్రావమవుతున్న తరుణంలో 108 సాయంతో సూర్యాపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మునగాల లోని కరెంటు సబ్స్టేషన్ వద్ద ఓ ట్రాక్టర్ వడ్ల లోడుతో వెళ్తున్న తరుణంలో అదుపుతప్పి జాతీయ రహదారిపై పడిపోవటంతో వడ్లు పూర్తిగా కింద పడిపోయాయి. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతుండడంతో మునగాల మండలంలోని ప్రజలు భయకంపితులవుతున్న పరిస్థితి ఏర్పడింది. బయటకు వెళ్లిన వ్యక్తి మరలా ఇంటికి చేరేవరకు గ్యారెంటీ లేదని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కేవలం మునగాల మండలంలోని జాతీయ రహదారిపై ఇలాంటి భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని, రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను వెంటనే అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.