ఏయిర్‌ఫోర్స్‌ మాజీ చీఫ్‌ త్యాగిపై ఛార్జీషీట్‌

ఢిల్లీ,సెప్టెంబర్‌ 1,(జనంసాక్షి): రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖులకు (వీవీఐపీలు) ఉద్దేశించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో ముడుపుల కేసుకు సంబంధించి వాయిసేన మాజీ అధిపతి ఎస్పీ త్యాగి, మరో తొమ్మది మందిపై సీబీఐ శుక్రవారంనాడు ఛార్జిషీటు దాఖలు చేసింది. 30,000 పేజీల ఛార్జిషీటును సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌ ముందు సీబీఐ ఫైల్‌ చేసింది. రూ.450 కోట్లు విలువచేసే హెలికాఫ్టర్ల కొనుగోలు డీల్‌లో ముడుపులకు సంబంధించి త్యాగితో పాటు ఆయన కజిన్‌ సంజీవ్‌, అడ్వకేట్‌ గౌతమ్‌ కైతాన్‌ పేర్లను ఛార్జిషీటులో చేర్చారు. 71 ఏళ్ల త్యాగి 2007లో భారత వాయిసేన నుంచి రిటైర్‌ కాగా, ఆయనతో పాటు సంజీవ్‌, ఖైతాన్‌లను అదే ఏడాది డిసెంబర్‌ 9లో అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు.