ఏరువాకను ఎరుక చేసుకునే ప్రయత్నం చేయాలి
ఏరువాక పూర్ణిమ అంటే రైతన్నల పండగ. భూమికి రైతులకు ఉన్న బంధమిది.అన్నదాతలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ‘ఏరువాక పౌర్ణమి’.ఈనాటి తిథి వివరణకు సంబంధించి ‘వృషభ పూజ’, ‘హల ప్రవాహ’ వంటి పదాలు ఉన్నాయి. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే ఈ పండుగను రైతన్నలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్షరుతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించడం పరిపాటి.కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను రంగులు, రకరకాల బట్టలతో అంకరించి డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు. ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ గోపాలురకు గిరియజ్ఞము, కర్షకులకు ఏరువాక యజ్ఞముగా, బ్రాహ్మణులు మంత్రజపమే యజ్ఞముగు చేయుదురని తెలుపగా, విష్ణుపురాణము దీనిని ఏరువాక సీతా యజ్ఞమని పేర్కొంటోంది.ఈ ఏరువాక పండుగ అతి ప్రాచీనమైంది. పూర్వము శ్రీ కృష్ణదేవరాయ సార్వభౌముడు రైతన్నల కృషిని అభినందించి తగిన రీతిలో రైతు సోదరులను ప్రోత్సహించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ.. ఒక బంగారు రంగు నాగలిని కర్షకులకు అందించినట్లు గాథలున్నాయి. ఒకప్పుడు ప్రతీ సంవత్సరం కనిపించే ఈ సంప్రదాయ పండుగ ఇప్పుడు మెల్లగా కనుమరుగవుతోంది. అక్కడా అక్కడా రైతులుకూడా మర్చిపోతున్నారు! రైతులు యాంత్రిక విధానాలకు అలవాటుపడి పైరు పండించడంలో విపరీతంగా రసాయన ఎరువులను వాడుతున్నారు. విపరీతంగా పురుగుమందులను వాడుతున్నారు. సహజసిద్దంగా భూమి ఇచ్చే రఓణకు దూరంగా కృత్రిమ విధానాలతో అటు పుడమితల్లికి ఇటు మానవాళికి చేటు చేస్తున్నారు. పశువులను పెంచడం పోయి వాటిని కోసుకు తింటున్నారు. దీంతో ప్రకృతిలో రైతులకు,భూమికి ఉన్న బాంధవ్యం తెగిపోతోంది. అందుకే ఏరువాక అన్నది సాగడం లేదు. రాబందులు అంతరిస్తున్నాయని, పుడమిలో ఉన్న వానపాముల జాడ లేకుండా పోతోందని, సీతాకోకచిలుకలు, అరుదైన పక్షి జంతుజాతులు అంతరిస్తున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యవసాయానికి మిత్రులుగా ఉన్న అనేక జీవజాలం అంతరించిపోతోంది. దీనికి రసాయన ఎరువుల వాడకమే అని వేరుగా చెప్పక్కర్లేదు. మనం అనుసరిస్తున్న ప్రకృతి విరుద్ద విధానాల కారణంగా ఏటికేడు విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. పశువులకు మేత, రైతుకు తిండి కరువై బతుకే బరువై వలసలు నిత్యకృత్యమయ్యాయి. తినేతిండి, తాగేనీరు, పీల్చేగాలి కలుషితంగా మారుతున్నాయి. వ్యవసాయంలో ఆధునిక పోకడల పేరుతో భూమిని నిర్వీర్యం చేసే చర్యలు ముమ్మరం అయ్యాయి. ప్లాస్టిక్ వాడకం పెరిగి భూమిలో కరిగిపోని పదార్థంగా మన మట్టితల్లిని మనకు దూరం చేస్తోంది. మానవ విజ్ఞానం, సాంకేతికతలు పెరిగాయని సంతోషిస్తున్న వేళ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమికి భారంగా మారాయి. మానవమనుగడకు, మానవుల ఆరోగ్యాలకు సవాలుగా మారాయి. దీంతో మనమే గాకుండా భూమిపై ఉండే జీవజాతుల రక్షణకు కూడా ముప్పు వాటిల్లుతోంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ కోణాల మధ్య సమతుల్యతతో జరిగే అభివృద్ధినే సుస్థిరాభివృద్ధి అంటాం. భవిష్యత్ తరాల సంక్షేమం దెబ్బతినకుండా ప్రస్తుత తరాల అవసరాలు తీర్చు కోవాలనే మౌలిక సూత్రం ఇందులో ప్రధానంగా ఉంటుంది. పర్యావరణ సమతుల్యతలు దెబ్బతినడం వల్ల
రాబోవు తరాల ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది. పర్యావరణాన్ని పక్కకు నెట్టి ఎలాగైనా ఆర్థికంగా ముందుకు వెళ్లాలనునే క్రమంలో మనం కూర్చున్న చెట్టుకొమ్మను నరుక్కుంటున్నామన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఒక ప్లాస్టిక్ కవరు మట్టిలో కలవటానికి 10 లక్షల ఏళ్లు పడుతుంది. ఇలాంటి ప్లాస్టిక్‌ను నిత్య జీవితంలో విపరీతంగా వాడేస్తున్నాము. పెళ్ళిళ్ళు, వేడుకలలో వాడిపాడేస్తున్న ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కవర్లు ఎంత ప్రమాదకరమో ఆలోచించటం లేదు. వాటి ద్వారా రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇంతటి దారుణమై నిజాలు తెలిసి మన చేజేతులా మనం నివసిస్తున్న భూమిని నాశనం చేసుకుంటున్నాం. ఇలా చేయడం ఎంతవరకు సబబో ఆలోచన చేయాలి. మనం మాత్రమే బతకడం కాదు.. మన తరవాతి తరం క్షేమంగా బతికేలా భూమిని పరిశుద్దంగా ఉంచుకోవాలి. మన సంస్కృతిని విస్మరించి, పెద్దలు మనకు అందించిన జ్ఞనా భాండాగారాన్ని కాదని ప్లాస్టిక్ ఉచ్చులో పడుతున్నాం. ప్రతి వస్తువు తయారయ్యే క్రమంలో ఇంధనం ఖర్చయి, కాలుష్యం పెరుగుతోంది. వాహనాలు, పరిశ్రమలు, అధునాతన సౌకర్యాలనిచ్చే యంత్రాలు హరితగృహ వాయువులను విడుదల చేస్తున్నాయి. ఫలితంగా భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వీటి కారణంగా అడవులను, సరస్సులను, నదులను, అడవి జంతువులతో పాటు సహజ పర్యావరణాన్ని కాపాడి మనకు తోడ్పడుతున్న అన్నింటిని కోల్పోతున్నాం. ఈ ఏరువాక సందర్బంగా అయినా కళ్లు తెరచి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించడం చేస్తే మంచిది. పుడమిని పదికాలా పాలు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. పర్యావరణ వ్యతిరేక చర్యలు కఠినంగా అమలు చేస్తే తప్ప భూమిని కాపాడుకోలేం. వ్యవసాయంతో దీన్ని మొదలు పెట్టే సంకల్పం రావాలి.