ఏవియేషన్‌లో భారత్‌ గణనీయ అభివృద్ధి

C

– అంతర్జాతీయ వైమానికి ప్రదర్శనను ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణబ్‌

హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): దశాబ్ద కాలంలో పౌరవిమానయాన రంగంలో 14శాతం వృద్ధి నమోదైనట్లు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తెలిపారు. 2020 నాటికి వైమానిక సంస్థలు 421 మిలియన్ల మందికి సేవలందించే స్థాయికి చేరతాయని… తద్వారా భారత్‌తో వ్యాపార అవకాశాలు మరింత వృద్ధి చెందుతాయన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ వైమానిక సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పౌర విమానయాన రంగంలో భారత్‌ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉందని.. 2022 నాటికి మూడో స్థానానికి చేరుకుంటుందన్నారు. అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ అభినందనీయమని ప్రశంసించారు. భారత్‌ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని పేర్కొన్నారు. భారత్‌లో మధ్యతరగతి ప్రజల ఆదాయం 60శాతం మేర పెరిగిందని రాష్ట్రపతి తెలిపారు. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ రోజుకు లక్షలాది మందిని గమ్యస్థానానికి చేర్చుతుందన్న ప్రణబ్‌, ఏవియేషన్‌ రంగంలో తయారీపై దృష్టిసారించామన్నారు.   పౌర విమాన రంగం విస్తృతంగా వ్యాప్తి చెందడం ద్వారా భారత్‌లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రణబ్‌ అన్నారు. దశాబ్ధకాలంలో పౌరవిమానయాన రంగంలో సుమారు 14 శాతం వృద్ధి నమోదైందన్నారు. ఏరోస్పేస్‌ రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై భారత వైమానిక రంగం దృష్టిపెట్టాలని ప్రణబ్‌ తెలిపారు. ఏరోస్పేస్‌ టెక్నాలజీపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేయాలన్నారు. ఏరోస్పేస్‌ టెక్నాలజీ హబ్‌గా భారత్‌ను తయారు చేయాలని ఆయన వైమానిక సదస్సుకు వచ్చిన డెలిగేట్లను ఉద్దేశించి కోరారు. అంతర్జాతీయ వైమానిక సదస్సు హైదరాబాద్‌లో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. బేగంపేట విమానాశ్రయంలో ఇండియా ఏవియేషన్‌ పేరిట ఏర్పాటుచేసిన సదస్సు,

ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని వైమానిక విశ్వ కేంద్రంగా రూపొందించే లక్ష్యంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రతి రెండేళ్లకోసారి అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సు నిర్వహిస్తోంది. ఇందుకు హైదరాబాదే వేదికగా మారింది. అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు 25దేశాల మంత్రులు, రాయబారులు, ఉన్నతాధికారులతో పాటు వైమానిక రంగంలో పేరొందిన 12 దేశాలకు చెందిన 200 కంపెనీల వాణిజ్య ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. మొదటి మూడు రోజులు దేశవిదేశాల ప్రతినిధులతో అధికారిక కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రెండు రోజులు సాధారణ ప్రజలను అనుమతిస్తారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ…సీఎం కేసీఆర్‌తో కలిసి ఏవియేషన్‌ షోను ప్రారంభించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ ఏవియేషన్‌ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎన్నో రక్షణ రంగ సంస్థలు ఉన్నాయని, విమానాల విడిభాగాల తయారీకి రాష్ట్రంలో రెండు ఏరో స్పేస్‌ పార్కులు ఏర్పాటు చేసినట్లు ఆయన  ప్రకటించారు. ఐదు రోజుల పాటు జరిగే ఏవియేషన్‌ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం అని పేర్కొన్నారు..ఇదిలావుంటే దాదాపు 2 వందల దేశాలకు చెందిన విమానాలు, 5 రోజుల పాటు సందర్శకులను అలరించనున్నాయి. మొదటి మూడు రోజులు బిజినెస్‌ విజిటర్స్‌ను, అలాగే చివరి రెండు రోజులు సందర్శకులను అధికారులు అనుమతించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు, తెలంగాణ మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పెట్టుబడులకు తెలంగాణే స్వర్గధామం

– సీఎం కేసీఆర్‌

భారత వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్‌ ను మించిన వేదిక లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ లో ఈ ప్రదర్శన జరగడం, తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌ పోర్టులో భారత వైమానిక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత వైమానిక ప్రదర్శన విజయవంతం కావాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. వైమానిక రంగంలో మొదటి ఎస్‌ఈజెడ్‌ హైదరాబాద్‌ లోనే స్థాపించబడిందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్‌ లో డీఆర్డీఓ, డీఆర్డీఎల్‌, డీఎల్‌ఆర్‌ఎల్‌ లాంటి రక్షణరంగ పరిశోధన సంస్థలున్నాయని, మిథాని, బీడీఎల్‌, హెచ్‌ఎఎల్‌ లాంటి ప్రసిద్ధి ప్రభుత్వ రంగ సంస్థలున్నాయని వివరించారు. ఏరో స్పేస్‌ రంగానికి ఇవి ఎంతో ఊతమిస్తాయని చెప్పారు. హైదరాబాద్‌ లో రెండు ఏవియేషన్‌ పార్కులున్నాయని, ఆదిభట్లలో మరో ఏవియేషన్‌ పార్క్‌ అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ఏరోస్పేస్‌ రంగంలో ఏ రాష్ట్రంలో లేని అనువైన వాతావరణం తెలంగాణలో ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. లైఫ్‌ స్టైల్‌, లా అండ్‌ ఆర్డర్‌, పర్సనల్‌ సేఫ్టీ, కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ లో హైదరాబాద్‌ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. క్వాలిటీ, నిరంతర కరెంట్‌ సరఫరా, నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమలకు సులువుగా అనుమతులతో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందన్నారు.