ఏసీబీ గో హెడ్
– ఓటుకు నోటు కేసులో ఈసీ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్,జూన్17(జనంసాక్షి):
ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఓటుకు నోటు కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని ఈసీ నుంచి లేఖ వచ్చినట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. పూర్తి స్థాయి నిజాలు నిగ్గు తేలే వరకు విచారణ చేయాలని ఈసీ కోరిందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినెటేడ్ ఎమ్మెల్యే కొనుగోలుకు రూ. 5 కోట్లకు బేరం పెట్టడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో లాజికల్ ఎండ్ కనుక్కోవడానికి ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ను ఈసీ ఆదేశించింది. సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలిందని భావిస్తున్నారు. .ఇన్ని రోజులు ఓటుకు నోటు కేసును ఎన్నికల సంఘం విచారించవలసి ఉండగా, తెలంగాణ ఎసిబికి ఏమి సంబందం అని తెలుగుదేశం నేతలు వాదిస్తూ వచ్చారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఎన్నికల సంఘం ఈ కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎసిబి అదికారులకు లేఖ అందింది. ఓటుకు నోటు కేసు ను పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నివేదిక పంపాలని ఎన్నికల సంఘం కోరింది. ఈ కేసులో ఎమ్మెల్యేల పాత్ర తదితర అంశాలపై విచారణ జరపాలని కోరింది.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టుకు ముందే ఎసిబి ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చిందని, ఆ తర్వాత కూడా రెండుసార్లు సమాచారం పంపిందని అధికారవర్గాలు వెల్లడించాయి. దీంతో
ఈ కేసు దర్యాప్తు వేగవంతం కావచ్చు.