ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఆర్థిక దన్ను

 

పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను ఎవరైనా ఆర్థిక సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారుకి విక్రయించేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతోపాటు మరికొన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం వద్దకు వచ్చాయి. ఐఎల్‌అండ్‌ ఎఫ్‌ఎస్‌ నూతన బోర్డు వీటిని బుధవారం ఎన్‌ఎస్‌ఎల్‌టీకి సమర్పించనుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు దాదాపు రూ.92వేల కోట్ల మేరకు అప్పులు ఉన్నాయి. ఈ ప్రతిపాదనతో పాటు విభాగాల వారీగా వ్యాపారాలను పలువురుకి విక్రయించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఈ రెండు ప్రతిపాదనలు సాధ్యం కాని పక్షంలో గ్రూప్‌నకు నిధులను సమకూర్చి నిలదొక్కుకునేందుకు కృషి చేయలని కూడా ఆలోచిస్తోంది. ఈ ప్రణాళికను ఉదయ్‌కొటాక్‌ నేతృత్వంలోని నూతన బోర్డు సిద్ధం చేసింది. ప్రస్తుత పరిణామాల నేథ్యంలో రుణాల చెల్లిపునకు ఆస్తుల విక్రయం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో దాదాపు 348 సబ్సిడరీ కంపెనీలు ఉన్నాయి. దీంతో నిర్వహణ కష్టతరంగా మారింది. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, జపాన్‌కు చెందిన ఓరిక్స్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థలు పెట్టుబడి పెట్టాయి. దీని వ్యవస్థాపకుడు రవి పార్థసారధి జులైలో సారథ్యం నుంచి తప్పుకొన్నప్పటి నుంచి సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.