ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను అమ్మేయడమే లక్ష్యం

ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన

న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను అమ్మేయడమే మంచిదని కేందప్రభుత్వం భావిస్తోంది. కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇదే ఉత్తమమైన మార్గంగా కన్పిస్తున్నట్లు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ అన్నారు. ‘కంపెనీకి చెందిన ఓ సమస్య పరిష్కారానికి వాటాదారులు, ప్రజల ప్రయోజనాలే ప్రధానంగా పరిగణనలోకి వస్తాయి. ఐఎల్‌ ఎఫ్‌ఎస్‌కు సంబంధించినంత వరకూ వివిధ పరిష్కార మార్గాలను అన్వేషించాం. వీటిల్లో కంపెనీని విక్రయించడమే ఉత్తమమైనదిగా కన్పిస్తోంది’ అని శ్రీనివాస్‌ తెలిపారు. ఐఎల్‌ ఎఫ్‌ఎస్‌ ఇటీవల వేల కోట్ల రూపాయల రుణ సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రుణాల విషయంలో సరైన నిర్వహణ లేకపోవడంతో అప్పుల్లో చిక్కుకోవాల్సి వచ్చింది. దీంతో కంపెనీని ఆ ఊబిలో నుంచి బయటపడేయడానికి ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ఐఎల్‌ ఎఫ్‌ఎస్‌ను తమ అధీనంలోకి తీసుకుంది. కంపెనీలోని అవకతవకలపై విచారణకు ఆదేశించింది. ఇటీవలే ఇందుకు సంబంధించిన నివేదికను నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యూనల్‌కు సమర్పించింది.