ఐఏఎస్‌ల విభజన పూర్తి
– తెలంగాణకు 208 మంది
– నెలాఖరు కల్లా ప్రక్రియ పూర్తి కావాలి
– ముఖ్యమంత్రి కేసీఆర్
– అన్ని శాఖలకు సర్క్యూలర్ జారీ
హైదరాబాద్,మే13(జనంసాక్షి):తెలంగాణ, ఏపీలకు ఐఎఎస్ అధికారుల కేటాయింపు పూర్తయ్యింది. ఈ మేరకు తుది జాబితాను ఖరారు చేస్తూ డీవోపీటీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తెలంగాణకు అదనంగా 30 శాతం ( 41 మంది) ఐఎఎస్ అధికారులను కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్రానికి ఐఏఎస్ ల సంఖ్య 167 ఉండగా, దాన్ని 208 కి పెంచింది. శాఖల వారీగా డిజిగ్నేషన్లపైన కూడా స్పష్టత ఇస్తూ డీవోపీటీ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీతోపాటు ఇద్దరు స్పెషల్ సీఎస్ అధికారులు, 16 మంది ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు, 18 మంది కార్యదర్శి స్థాయి అధికారులు, 19 మంది కమిషనర్ స్థాయి అధికారులు, 10 మంది కలెక్టర్లు, 11 మంది జాయింట్ కలెక్టర్లు, 21 మంది డైరెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లుగా మరో ఐదుగురు జాయింట్ కలెక్టర్లు, జీహెచ్ ఎంసీ కమిషనర్లుగా ముగ్గురు ఐఎఎస్ అధికారులను కేటాయించింది. స్పెషల్ కలెక్టర్లుగా (ఐ అండ్ క్యాడ్) ముగ్గురు, తెలంగాణ విజిలెన్స్ డిపార్టుమెంట్ కు ఒకరు, టీస్ పీఎస్సీకి ఒకరు, ఈసీ డిప్యూటీ సీఈఓగా ఒకరిని నియమించింది. సీసీఎల్‌ఏ కార్యదర్శిగా ఒక పోస్టు, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ గా ఒక పోస్టు, వీళ్లతోపాటు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ పై 45 మంది ఐఏఎస్ లు, స్టేట్ డిప్యుటేషన్ పై 28 మంది ఐఎఎస్ లు, ట్రైనింగ్ కోసం రిజర్వ్ చేసినవారు ముగ్గురు, లీవ్ కోసం రిజర్వ్ చేసినవారు 18 మంది, ఐఎఎస్ లుగా పదోన్నతి పొందినవారు 63 మంది ఉన్నారు.రాష్ట్రం విడిపోయిన రెండేళ్లలో ఉమ్మడి రాష్ట్ర చట్టాలను అన్వయించుకోకపోతే అన్ని చట్టాలనూ మళ్లీ బిల్లుల రూపంలో తెచ్చి శాసనసభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అవసరం మేరకు అడపాదడపా ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని చట్టాలను అన్వయించుకోవడం మినహాయిస్తే, దత్తత తీసుకోవాల్సిన చట్టాలు ఇంకా 3 వేల దాకా ఉంటాయి. ఈ మేరకు అన్ని శాఖలు తమ పరిధిలో ఉన్న విభజన అంశాలను ఓసారి సవిూక్షించుకోవాలని సర్క్యులర్ లో పేర్కొన్నారు. ఒక్కో అంశాన్ని విడివిడిగా పరిశీలించకుండా శాఖాపరంగా పూర్తి స్థాయిలో విభజన ప్రక్రియ కంప్లీట్ అయ్యేలా చూడాలని సీఎస్ ఓ సర్క్యులర్ ను జారీ చేశారు.అన్ని చట్టాలను శాఖల వారీగా సవిూక్షించుకుని అవసరమైన వాటిని మాత్రమే అడాప్ట్ చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను కూడా ఈ (మే) నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఏ చట్టాలను కొనసాగించాలి, వేటిని పక్కన పెట్టాలి అనే విషయంలో అవసరమైతే నల్సార్ లా యూనివర్సిటీ సలహా తీసుకోవాలని ఛీఫ్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ సూచించారు. ముఖ్యంగా అన్ని శాఖలను, ప్రజలను ప్రభావితం చేసే చట్టాలను ఉమ్మడి రాష్ట్రం నుంచి వెంటనే తెలంగాణకు వర్తింపచేసుకోవాలని ఆదేశించారు.
నెలాఖరుకల్లా విభజన ప్రక్రియ పూర్తి కావాలి
ఈ నెల చివరినాటికి విభజన ప్రక్రియపై పూర్తి క్లారిటీ రావాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి అన్ని శాఖల్లో విభజన ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలను అన్వయించుకోవడంతో పాటు జూన్ రెండు కల్లా విభజన సంపూర్ణంగా జరిగిపోవాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రం విడిపోయిన రెండు సంవత్సరాల లోపు చట్టాలన్నింటినీ దత్తత చేసుకునే ప్రక్రియ కూడా పూర్తి కావాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో నిబంధన ఉంది. దీంతో నెలాఖరుకల్లా విభజనపై పూర్తి క్లారిటీ రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ నేతృత్వంలో విభజన ప్రక్రియపై కసరత్తు ముమ్మరం చేశారు.




