ఉగ్రవాదంపై ఐక్యంగాపోరాడదాం
– మోడీని కోరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
– న్యూయార్క్ లో ఘటనపై ట్రంప్‌కు ఫోన్‌చేసిన మోడీ
న్యూఢిల్లీ, నవంబర్2(జనంసాక్షి):ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలని భారత్, అమెరికా దేశాలు నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారని వైట్‌హౌజ్ పేర్కొన్నది. న్యూయార్క్‌లో ఓ ఉన్మాది ట్రక్కుతో దాడి చేసిన ఘటనలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన పట్ల సంతాపం తెలిపేందుకు ప్రధాని మోదీ.. బుధవారం రాత్రి ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరు ఉగ్రవాద అంశం గురించి చర్చించినట్లు వైట్‌హౌజ్ వెల్లడించింది. ఉగ్ర చర్యలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారని, న్యూయార్క్ బాధిత కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారని వైట్‌హౌజ్ పేర్కొన్నది. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం న్యూయార్క్ దాడిని ఖండిస్తూ ట్వీట్ కూడా చేశారు. బ్రిటీష్ ప్రధాని థెరిసా మే కూడా ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రవాదం పట్ల పోరాడేందుకు థెరిసా మే కూడా తమ మద్దతు ప్రకటించారు.