ఐటిరంగంలో దూసుకుపోతున్న ఎపి

పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

తిరుమల,జూలై22(జనం సాక్షి ): ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. తిరుమలలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో పలు పరిశ్రమలు నెలకొల్పడానికి సంస్థలు ముందుకు వచ్చాయని గుర్తు చేశారు. మూడేళ్లలో 30 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించామని, వచ్చే రెండు సంవత్సరాల్లో మరో 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. త్వరలోనే విశాఖకు ఇన్ఫోసిస్‌ తరహా కంపెనీలు రానున్నాయని తెలిపారు. విజయవాడ, తిరుపతి, విశాఖ, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. వరదల కారణంగా ప్రభావితమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.2 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.