ఐటి పరిధిలోకి మరో 50వేల మంది

కొత్త సంవత్సరంలో లక్ష్యం

న్యూఢీల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు మరో 50 వేల మందిని పన్ను పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంగా ఐటి అధికారులు పనిచేస్తున్నారు. మరింతమందిని పన్ను పరిధిలోకి తేవడం ద్వారా ఆదాయం గణనీయంగా పెంచాలన్నది ఈ శాఖ లక్ష్యంగా ఉంది. దీనిని సాధించగలమన్న విశ్వాసాన్ని ఐటీ శాఖ విశ్వాసంతో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా కోటీ 6 లక్షల మంది ఆదాయపన్ను పరిధిలోకి వచ్చారు. దేశ ఆర్థికవ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో సంఘటిత, అసంఘటిత రంగాలలో కార్యకలాపాలు పుంజుకున్నాయనీ, దీంతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్తగా 75 లక్షల మంది ఆదాయపు పన్ను చెల్లించారని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆదాయపు పన్ను పరిధిలోకి కోటీ 25 లక్షల మందిని తీసుకురావాలని ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) లక్ష్యంగా నిర్దేశించింది. ఆదాయపు పన్ను శాఖకు విధాన నిర్దేశనం చేస్తుంది. కాగా, పన్నుల ఎగవేతను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యల కారణంగా పన్ను చెల్లింపు దారులు పెరిగారని సీబీడీటీ తెలిపింది. ఇదిలాఉండగా, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి కొత్తగా 10,40,218 మందిని కొత్తగా ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురావాలని సీబీడీటీ ఆదాయపు పన్ను శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో లక్ష్యం మేరకు ప్రకటన రూపంలో ప్రచార కార్యక్రమాలకు సిద్దం అవుతున్నారు.