ఐటీఎస్ ఉద్యోగులను బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి తొలగించాలి
నిజామాబాద్,అక్టోబర్ 30: ఇండియన్ టెలికాం సర్వీసు ఉద్యోగులను బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి తొలగించాలని కోరుతూ మంగళవారం ఆ శాఖ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా బిఎస్‌ఎన్‌ఎల్ జేఏసి కన్వీనర్ నారా యణ మాట్లాడుతూ గత పన్నెండేళ్లుగా నిబంధనలకు వ్యతిరేకంగా, కోర్టు తీర్పులను సైతం బేఖాతర్ చేస్తూ బిఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనానికి నిరాకరిస్తూ, పెత్తనం చెలాయిస్తున్న 1200 మంది ఐటిఎస్ అధికారులను వెంటనే బిఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం చేయాలని లేని పక్షంలో వారిని బిఎస్‌ఎన్‌ఎల్ నుండి తొలగించాలని డిమాండ్ చేశా రు. బిఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనమైన లేదా బిఎస్‌ఎన్‌ఎల్ ద్వారా రిక్రూట్ అయిన 2.70 లక్షల ఉద్యోగులను కూడా ఐటిఎస్ అధికారులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు నగరంలోని సుభాష్‌నగర్ నుంచి బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జేసి హర్షవర్ధన్‌కి వినతి పత్రం అందించారు. ఈ ధర్నాలో బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు పాల్గొన్నారు.