ఐటీగ్రిడ్‌ కేసులో..  కీలక ఆధారాలు లభ్యమయ్యాయి


– సేవామిత్ర యాప్‌ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు
– డేటా అమెజాన్‌ సర్వీస్‌లో భద్రపర్చారు
– అమెజాన్‌ వెబ్‌ సర్వేసెస్‌కు నోటీసులు జారీచేశాం
– వారం రోజుల్లో వివరాలు ఇవ్వాలని కోరాం
– ఐటీ గ్రిడ్‌ కేసులో దర్యాప్తు సాగుతుంది
– విలేకరుల సమావేశంలో సైబారాబాద్‌ సీపీ సజ్జనార్‌
హైదరాబాద్‌, మార్చి4(జ‌నంసాక్షి) : ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. లోకేశ్వర్‌ రెడ్డి ఫిర్యాదుతోనే ఐటీ గ్రిడ్స్‌లో సోదాలు నిర్వహించామని తెలిపారు. ఉద్యోగులు సమక్షంలోనే
సోదాలు జరిపామన్నారు. సంస్థకు చెందిన ఉద్యోగులు విక్రమ్‌ గౌడ్‌, చంద్ర శేఖర్‌, ఫణి కుమార్‌, భాస్కర్‌ల సమక్షంలోనే ఆధారాలు సేకరించామని తెలిపారు. కీలకమైన ఎలక్టాన్రిక్‌ డివైజ్‌లను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని చెప్పారు. ఐబాల్‌, డెల్‌ కంప్యూటర్‌, ట్యాబ్‌టాప్‌, డెల్‌ సీపీయూ, మొబైల్‌ ఫోన్స్‌, ఇతర పరికరాలను స్వాదీనం చేసుకున్నామన్నారు. ఎంక్యాబ్‌ సిరీస్‌ ఎలక్టాన్రిక్‌ పరికరాలను సీజ్‌ చేశామని చెప్పారు. సేవామిత్ర యాప్‌ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని, వీటికి సంబంధించిన ఆధారాలు కూడా సోదాల్లో లభించాయన్నారు. ఐటీ గ్రిడ్‌ డేటా అమెజాన్‌ సర్విస్‌లో భద్రపరినట్లు విచారణలో తేలిందన్నారు. నియోజకవర్గాల వారిగా ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డ్‌ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ అక్రమంగా సేకరించిందన్నారు. అక్రమంగా డేటా సేకరించి, ఓట్లు తొలగిస్తున్నట్లు కొంతమంది చేసిన ఫిర్యాదుపై దర్యాప్తును కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అమెజాన్‌ వెబ్‌ సర్వేసెస్‌కు నోటీసులు జారీ చేశామని, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. చట్టం ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.