ఐటీ రిటర్న్ దాఖలుకు గడువు పెంపు
– వ్యక్తిగతంగా చెల్లింపులకు 10 రోజులు
– సంస్థాగత చెల్లింపులకు 15రోజులు
దిల్లీ,డిసెంబరు 30 (జనంసాక్షి): ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 10 రోజుల గడువు ఇచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులను జనవరి 10 వరకు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే కంపెనీల ఐటీ రిటర్నుల దాఖలు గడువును 15 రోజులు పెంచింది. ఫిబ్రవరి 15 లోపు రిటర్నులు దాఖలు చేసుకునే వీలు కల్పించింది. కొవిడ్ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. అంతకుముందు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31గానూ, కంపెనీలకు జనవరి 31గానూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. గడువు సవిూపించిన నేపథ్యంలో పొడిగింపు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 28 వరకు 4.54 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. వివాద్ సే విశ్వాస్ గడువును కూడా జనవరి 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.