ఐదుగురు మిత్రుల్లో ఒకరు మృత్యువాత
మరో ఇద్దరికి గాయాలు..విషాదం నింపిన నిర్లక్ష్యం
హైదరాబాద్,ఆగస్ట్28 : ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితుల్లో ఒకరు మృత్యువాత పడడం, మరో ఇద్దరికి విద్యుత్ గాయాలు కావడంతో మిగతా ఇద్దరు ఆందోళణకు గురయ్యారు. తమను విధి వెన్నాడిందని ఆందోలనచెందారు. ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగవేటలో నగరానికి వచ్చిన వీరు ఒకే రూంలో ఉంటున్నారు. అయితే విధి వక్రీకరించి కరెంట్ షాక్‌తో వారిలో ఒకరు కన్నుమూయగా, మరో ఇద్దరు తీవ్రగాయాలకు గురయ్యారు. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ జయరాం కథనం ప్రకారం…. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునికేపల్లి గ్రామానికి చెందిన రవీందర్ (30), మురళి, మన్మధరావు, పవన్‌కుమార్, సతీష్‌లు ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం నగరానికి వచ్చి దిల్‌సుఖ్‌నగర్ గౌతంనగర్‌లో అద్దె రూంలో ఉంటున్నారు. ఆదివారం వీరు ఉండే రెండో అంతస్తు నుంచి పవన్‌కుమార్ కిందకు వచ్చాడు. ఇయర్‌ఫోన్ కోసం స్నేహితుడు రవీందర్‌కు చెప్పగా.. అతను దానిని కిందకు వేయగా చెట్టులో చిక్కుకుంది. దీంతో రవీందర్ ఐరన్ రాడ్‌తో దాన్ని తీసేందుకు ప్రయత్నిస్తుండగా మురళి, మన్మథరావు బాల్కానీలోని ఇనుప గ్రిల్స్ వద్ద నిల్చున్నారు. రాడ్ ఒక్కసారిగా విద్యుత్ తీగలకు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే రాడ్ గ్రిల్స్‌కు కూడా తగలడంతో మురళి, మన్మథరావులు షాక్‌కు గురై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మిగతా స్నేహితులు పోలీసుల సహకారంతో దవాఖానకు తరలించారు. మురళి ఆరోగ్యంపై డాక్టర్లు మరో 24 గంటలు గడిస్తేగానీ ఏవిూ చెప్పలేమని తెలిపారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.