ఐదో సారి ప్రమాణం చేసిన పురుచ్చి తలైవి

4

మంత్రులంతా ఒకే సారి ప్రమాణం

చెన్నై,మే23(జనంసాక్షి): తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత శనివారంనాడు ప్రమాణం చేశారు. ఈ పురుచ్చి తలైవి తమిళనాడు సీఎం పీఠాన్ని అధిరోహించటం ఐదోసారి. ఆమె సిఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది ఐదోసారి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కోర్టు నుంచి ఉపశమనం దక్కడంతో శనివారం ఆమె మరోమారు సిఎంగా గద్దెనెక్కారు. మద్రాస్‌ విశ్వవిద్యాలయంలోని సెంటినరీ హాలులో జయ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తమిళనాడు గవర్నర్‌ రోశయ్య జయలలితతో సీఎంగా ప్రమాణం చేయించారు. పలువురు సీని, రాజకీయ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌,నటుడు శరత్‌కుమార్‌, ఇళయరాజా, శ్రీనివాసన్‌, పలువురు అన్నా డీఎంకే నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. జయలలితతో పాటు 28మంది ఎమ్మెల్యేలు  మంత్రులుగా ప్రమాణం చేయడమే గాకుండా, తమిళనాడు చరిత్రలో మంత్రులు సామూహిక ప్రమాణ స్వీకారం చేయడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమానికి జయలలిత స్నేహితురాలు శశికళ కూడా హాజరయ్యారు. జయలలిత ప్రమాణస్వీకారం చేస్తుండగా సెంటినరీ హాల్‌ బయట కార్యకర్తలు బాణా సంచా కాల్చుతూ సంబురాలు జరుపుకున్నారు. కాగా, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయలలితను బెంగళూరు హైకోర్టు నిర్దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమమైంది. జయలలిత శనివారం ఉదయం 11 గంటలకు తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు.  జయలలిత ప్రమాణస్వీకారం చేస్తున్నంతసేపూ సెంటెనరీ హాలులో అభిమానులు, అన్నా డిఎంకె కార్యకర్తలు కేరింతలు కొడుతూనే ఉన్నారు. కొందరు సంతోషంతో ఈలలు కూడావేశారు. మంత్రులంతా వేర్వేరుగా గాకుండా ఒకేసారి వేదికపైకి ఆహ్వానించి  వారితో గవర్నర్‌ రోశయ్య  ప్రమాణస్వీకారం చేయించారు. నేను అని వచ్చిన సందర్భంలో మాత్రం మంత్రులు తమతమ పేర్లు వరుసగా ఉచ్చరిస్తూ ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గవర్నర్‌ రోశయ్య ఆమెకు పూలగుచ్చం అందించి శుభాకాంక్షలు చెప్పారు. జయ పదవి చేపట్టడంతో ఆమె అభిమానులు శనివారం ఉదయంనుంచే రోడ్లపై సందడిచేశారు. చెన్నై రహదారులన్నీ జయ ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ప్రమాణస్వీకారానికి పదిహేను నిమిషాలముందు జయలలిత తమ ఇంటినుంచి బయలుదేరడంతో అభిమానులు చెన్నై రోడ్లకు ఇరువైపులా ఆమెకు బ్రహ్మరథం పట్టారు. కొందరు ఆమెపై పూలవర్షం కురిపించారు. అభిమానులకు నమస్కారం చేస్తూ జయ చిరునవ్వుతో ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు.