ఐపిఎల్‌లో 16 కోట్లు పలికిన యువరాజ్‌ సింగ్‌

యూవీని ఎంపిక చేయకపోవడంపై తండ్రి మండిపాటు
బెంగుళూరు,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ):  ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న యువరాజ్‌ సింగ్‌కు ఐపీఎల్‌-8 రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. సోమవారం జరిగిన ఐపీఎల్‌ వేలం పాటలో యువరాజ్‌ సింగ్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఏకంగా రూ. 16కోట్లు పెట్టి దక్కించుకుంది. గత ఏడాది కేవలం 14 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ …యువరాజ్‌ పేలవ ప్రదర్శనతో వదులుకునేందుకు సిద్ధమైంది. కనీస ధర రూ.2 కోట్లతో ప్రారంభమైన యువరాజ్‌ వేలం పాట క్రమంగా ఫ్రాంచైజీలు పోటీపడటంతో పెరుగుతూ వచ్చింది. ఒకానొక దశలో బెంగళూరు రూ.15.50కోట్లు చెల్లించేందుకు సిద్ధమైనా… డేర్‌డెవిల్స్‌ మరో 50 లక్షలు వేలం పెంచడంతో విజయ్‌మాల్య వెనక్కి తగ్గారు. దీంతో 16కోట్లకు యువీ పలికాడు.ఐపీఎల్‌ ఎనిమిదో సీజన్‌ వేలం బెంగళూరులో కొనసాగుతోంది. దినేష్‌కార్తీక్‌ను బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్సు జట్టు రూ.10.5కోట్లతో దక్కించుకుంది. ఐపీఎల్‌ ఎనిమిదో సీజన్‌ వేలం బెంగళూరులో ప్రారంభమైంది. ఐపీఎల్‌ అధ్యక్షుడు రంజీబ్‌ బిస్వాల్‌ ఆధ్వర్యంలో వేలం కొనసాగుతోంది. శ్రీలంక ఆటగాడు ఏంజిలో మాథల్యిస్‌ని రూ.7.5కోట్లతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ దక్కించుకుంది. అంతకుముందు మురళీ విజయ్‌ని రూ.3కోట్లతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ దక్కించుకుంది. 344 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్నారు. ఐపీఎల్‌ ఎనిమిదో సీజన్‌ వేలం ప్రారంభమైంది.   దిల్లీ డేర్‌డెవిల్స్‌ కోచ్‌ గ్యారీ క్రిస్టన్‌ నేతృత్వంలో ఆడబోతుండటం చాలా సంతోషంగా ఉందని ఐపీఎల్‌ 8 వేలంలో రూ.16కోట్లు ధర పలికిన యువరాజ్‌సింగ్‌ అన్నారు. భారత మాజీ కోచ్‌ గ్యారీ క్రిస్టన్‌ నేతృత్వంలో మళ్లీ శిక్షణ తీసుకోబోతున్నందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. ‘ఐపీఎల్‌ వేలం జరుగుతున్న సమయంలో నేను నిద్రపోతున్నాను. కొంతమంది ఇంటికి వచ్చి నన్ను అభినందించడంతో ఈ విషయం తెలిసింది. మళ్లీ క్రిస్టన్‌ ఆధ్వర్యంలో ఆడబోతున్నాను. ఆయన శిక్షణలో మంచి విజయాలు సాధించాను. దిల్లీ డేర్‌డెవిల్స్‌తోనూ అవి పునరావృతమవుతాయని ఆశిస్తున్నాను’ అని యువరాజ్‌ పేర్కొన్నారు.

ఇదిలావుంటే టీమిండియా ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్‌ కప్‌కు యువరాజ్‌ సింగ్‌ ఎంపిక కాకపోవడం వెనుక కెప్టెన్‌ ధోని ప్రమేయం ఉందని ఆయన ఆరోపణలు చేశారు. ధోని ఒత్తిడి కారణంగానే జాతీయ సెలక్టర్లు యువరాజ్‌ని ఎంపిక చేయలేదని అన్నారు. ధోనికి తన కుమారుడితో విబేధాలుంటే అందుకు తానేవిూ చేయలేనని, ఆ దేవుడే చూసుకుంటాడని ఆయన వ్యాఖ్యానించారు. యువీ పట్ల ఇంత దారణంగా ప్రవర్తించడం కంటే విచారించదగ్గ అంశం మరోకటి ఉండదని ధోనిని ఉద్దేశించి అన్నాడు. వరల్డ్‌ కప్‌ ప్రాబబుల్స్‌ జాబితాలో యువరాజ్‌ సింగ్‌ చోటు దక్కించుకున్న తర్వాత రంజీల్లో వరుస సెంచరీలు సాధించాడు. దీంతో యువరాజ్‌ సింగ్‌కు వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు దక్కుతుందని అందరూ భావించినా, సెలక్టర్లు మొండి చేయి చూపించారు.