ఐపిఎల్‌ ఫిక్సంగ్‌పై సంచలన తీర్పు

4

ఐపీఎల్‌కు చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ను రెండేళ్లపాటు నిషేధం

ముంబై,జులై14(జనంసాక్షి):

క్రికెట్‌ ప్రపంచంలో కలకలం రేపిన ఐపిఎల్‌ స్ఫాట్‌ ఫిక్సింగ్‌ కేసులో మాజీ సిజెఐ జస్టిస్‌ లోథా నేతృత్వంలో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ సంచలన తీర్పునిచ్చింది. ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో సుప్రీంకోర్టు ప్యానెల్‌ తీర్పు ఐపిఎల్‌ ఫిక్సింగ్‌లను బట్టబయలు చేసింది. ఐపీఎల్‌కు గురునాథ్‌, రాజ్‌కుంద్రా శాశ్వతంగా దూరంగా ఉండాలని, ఐదేళ్లపాటు ఏరకమైన క్రికెట్‌ వ్యవహారాల్లో పాల్గొనరాదని కమిటీ ఆదేశించింది. గురునాథ్‌, రాజ్‌కుంద్రా బీసీసీఐ, క్రికెట్‌కు చెడ్డపేరు తెచ్చారని కమిటీ అభిప్రాయపడింది. ఐపీఎల్‌కు చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ను రెండేళ్లు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు ప్యానెల్‌ తీర్పు చెప్పింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై ఈ కమిటీ రెండేళ్ల నిషేధం విధించింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు సహభాగస్వామి రాజ్‌ కుంద్రాలపై జీవితకాల నిషేధం పెట్టింది. కేవలం ఐపిఎల్‌ మాత్రమే కాకుండా ఎటువంటి టోర్నీలలోనూ వీరి ప్రమేయం ఉండకూడదని కమిటీ ఆదేశించింది. ఐపీఎల్‌ ప్రతిష్టను మేయప్పన్‌, కుంద్రా దిగజార్చారని లోథా కమిటీ వ్యాఖ్యానించింది. ఐపిఎల్‌ ఫిక్సింగ్‌ బారిన పడడం అప్పట్లో సంచలనం రేపింది. బీసీసీఐ మాజీ బాస్‌ శ్రీనివాసన్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలను ఎదుర్కొని తన పదవికి ముప్పు తెచ్చుకున్నారు. అప్పట్లో శ్రీనివాసన్‌ ఈ పరిణామంపై స్పందిస్తూ తాము నిర్దోషులమని, తాను, తన అల్లుడు ఏ పాపం ఎరుగమని కబుర్లు చెప్పారు. మరి ఇప్పుడు ఐసీసీ బాస్‌గా ఉన్న శ్రీనివాసన్‌ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. తాజా పరిణామాలతో ఐపీఎల్‌-9 సందిగ్ధంలో పడింది.