ఐపీఎల్‌ ప్రసార హక్కుల పక్రియ జోక్యం చేసుకోబోం

బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పిటిషన్‌ ను తిరస్కరించిన సుప్రీం

న్యూఢిల్లీ,ఆగస్టు28  : ఐపీఎల్‌ ప్రసార హక్కులను ఈ-వేలం వేయాలన్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పిటిషన్‌ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రసార హక్కుల పక్రియలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టంచేసింది. ఐపీఎల్‌ ప్రసార హక్కుల అప్పగింతలో ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ-వేలం నిర్వహించాలని సుబ్రమణ్యస్వామి గత మే నెలలో లోధా ప్యానెల్‌కు లేఖ రాశారు. ప్రధాని మోడీ ఓ వైపు డిజిటల్‌ వైపు అడుగులు వేస్తుంటే.. బీసీసీఐ మాత్రం వేలాన్ని భౌతికంగా ఎందుకు నిర్వహిస్తోందని సుబ్రమణ్య స్వామి తన లేఖలో పేర్కొన్నారు. అయితే కోర్టులో మాత్రం స్వామి వాదన తేలిపోయింది. అయితే ఈ-వేలాన్ని బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. క్లోజ్డ్‌ టెండర్‌ పక్రియ ద్వారానే లాభసాటిగా ఉండటమే కాకుండా, పారదర్శకత ఉందని బోర్డు తరఫున న్యాయవాది వాదించారు. ఇక విూడియా హక్కులను మూడు విభాగాలుగా చేసి టెండర్లు ఆహ్వానించింది. ఐపీఎల్‌ కోసం 2018-22 కాలానికిగాను తాజాగా ఈ టెండర్లు ఆహ్వానించారు. అందులో భారత ఉపఖండం టెలివిజన్‌ హక్కులు, ఇండియన్‌ సబ్‌ కాంటినెంట్‌ డిజిటల్‌ హక్కులు, రెస్టాఫ్‌ ద వరల్డ్‌ విూడియా హక్కుల కోసం టెండర్లు ఆహ్వానించింది. దీనికి చివరి తేదీని సెప్టెంబర్‌ 1 వరకు పొడిగించింది. ఇప్పటికే ఈ హక్కుల కోసం స్టార్‌ ఇండియా, సోనీ, అమెజాన్‌, రిలయెన్స్‌ లాంటి దిగ్గజ సంస్థలతో పాటు మొత్తం 18 కంపెనీలు ఈ రేసులో ఉన్నాయి.