ఐబీఎల్‌పై కార్పోరేట్ కంపెనీల ఆసక్తి
ప్రాంచైజీల కోసం క్యూ కట్టిన 18 సంస్థలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతటి సంచలనానికి దారితీసిందో అందరికీ తెలిసిందే… ఇదే తరహాలో మిగిలిన క్రీడల్లోనూ లీగ్స్ ప్రారంభమవుతున్నాయి. తాజాగా బ్యాడ్మింటన్‌ను అభిమానులకు మరింత చేరువ చేసే ఉధ్ధేశంతో భారత బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రారంభించిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌కు అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఐబిఎల్‌లో భాగమయ్యేందుకు కార్పొరేట్ కంపెనీలన్నీ ఎంతో ఉత్సాహం చూపిస్తున్నాయి. లీగ్‌లో ఫ్రాంచైజీల కోసం ఇప్పటికే 18 కంపెనీలు క్యూలో ఉన్నాయి. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే తొలి ఎడిషన్‌కు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొత్తం ఆరు ఫ్రాంచైజీలు లీగ్‌లో భాగం కానున్నాయి. వీటిలో హైదరాబాద్, బెంగళూర్, ముంబై, పుణెళి, నాగ్‌పూర్, లక్నో, చెన్నై, న్యూఢిల్లీ ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూర్, ముంబై ఫ్రాంచైజీల కోసం దాదాపు 18 కంపెనీలు రేసులో నిలిచాయి. అయితే ఈ కంపెనీల వివరాలు మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు. ఈ స్పందనను ఏమాత్రం ఊహించని నిర్వాహకులు మరో 14 కంపెనీల వరకూ బిడ్డింగ్ దాఖలు చేసే అవకాశమున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే బ్యాడ్మింటన్‌లో అగ్రదేశాలుగా ఉన్న చైనా, జపాన్, మలేషియాతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్, ఇంగ్లాండ్ వంటి దేశాల అసోసియేషన్లకు బాయ్ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తొలిసారిగా అత్యధిక ప్రైజ్‌మనీతో నిర్వహిస్తోన్న ఈ లీగ్‌లో వరల్డ్ టాప్ 50 ప్లేయర్స్ పాల్గొంటున్నారు. వీరిలో ఒలింపిక్స్ ఛాంపియన్ లిన్ డాన్, వరల్డ్ నెంబర్ వన్ లి చాంగ్ వితో పాటు పలు దేశాల స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తోన్న ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ మొదటి సీజన్ వచ్చే ఏడాది జూన్ 24 నుండి జూలై 11 వరకూ జరగనుంది. దేశంలోని ఆరు ప్రధాన నగరాలు దీనికి వేదికగా నిలవనున్నాయి. భారత్ నుండి అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనానెహ్వాల్, గుత్తా జ్వాల, పారుపల్లి కష్యప్, అశ్విని పొన్నప్ప, పివి సింధు లాంటి వారు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఐపీఎల్ తరహాలోనే ప్రతీ ఫ్రాంచైజీకి ఐకాన్ ప్లేయర్స్ కూడా ఉండనున్నారు. తొలి సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ళ వేలం వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నారు. ఈ లీగ్‌తో బ్యాడ్మింటన్‌కు మరింత ఆదరణ లభిస్తుందని, భారత్‌లోని యువ క్రీడాకారులకు ఆర్థికపరమైన ప్రోత్సహం కూడా లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.