ఐర్లాండ్‌తో నేడు కీలక మ్యాచ్
మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా
కైస్ట్ర్ చర్చ,మార్చి9(జనంసాక్షి): వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా జట్టు మంగళవారం మరోమ్యాచ్ ఆడబోతోంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఇప్పటికే క్వార్టర్‌కు చేరుకున్నే భారత్ జట్టు ఐర్లాండ్‌తో ఐదో మ్యాచ్ ఆడబోతంది. అయితే ఐర్లాండ్ కూడా సంచలన విజయాలు సాధిస్తూ పటిష్టంగా ఉండడంతో భారత్ దీనిని తక్కువగా అంచనా వేయడం లేదు. టీమిండియా బౌలింగ్ గాడినపడడంతో పాటు బ్యాటింగ్ ఫీల్డింగూ బాగున్నాయి. ఇప్పటికే క్వార్టర్స్‌లో చోటు ఖాయమైంది. మొన్న శుక్రవారం విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కొంత తడబడినా విజయం అందుకుని క్వార్టర్స్‌కు చేరుకుంది. అందుకే టీమ్‌ఇండియా రెట్టించిన ఉత్సాహంతో ప్రపంచకప్‌లో మరో సమరానికి సన్నద్ధమవుతోంది. మంగళవారం పూల్-బిలో జరిగే మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది. చిన్న జట్టే అయినా ఐర్లాండ్‌ను తేలిగ్గా తీసుకుంటే పొరపాటేనని టీమ్ మేనేజర్రవిశాస్త్రి కూడా హెచ్చరిస్తున్నాడు. చక్కని ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఆ జట్టు ఇప్పటికే వెస్టిండీస్‌కు షాకిచ్చింది. యూఏఈ, జింబాబ్వేలపైనా గెలిచింది. ఆరు పాయింట్లతో ముందు వరుసలో ఉంది. మరొక్క మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్స్ స్థానం ఖాయం కానున్న నేపథ్యంలో ఐర్లాండ్ గట్టిగానే ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. ఇండియాతో జరిగే మ్యాచ్‌ను ప్రతిష్టగా తీసుకుని పోరాడే అవకాశం ఉంది. ఇదిలావుంటే మహ్మద్ షమి సహా కొద్ది మంది కీలక ఆటగాళ్లకు భారత్ ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే అవకాశముంది. షమి మూడు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. పిచ్ స్పిన్‌కు ఎక్కువగా సహకరించే అవకాశం లేని నేపథ్యంలో తుది జట్టులో రవీంద్ర జడేజా స్థానంలో స్టువర్ట్ బిన్ని ఎంపికయ్యే అవకాశముంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌లో భారత్ ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లోనూ పరుగల వరద పారనుంది. ఎందుకంటే పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గదామం. హమిల్టన్ మైదానం కూడా చిన్నది కావడం కూడా బ్యాట్స్‌మెన్‌కు కలిసొచ్చేదే. పిచ్‌పై ఎలాంటి పచ్చిక ఉంచట్లేదని, బంతి కొద్దిగా బౌన్స్ అయ్యే అవకాశం ఉందని క్యురేటర్ చెప్పాడు. ‘ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం 9 భిన్నమైన పిచ్‌లను సిద్ధం చేశాం. వీటిపై ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరగ్గా…భారత్-ఐర్లాండ్ మ్యాచ్ మూడోది’ అని జాన్సన్ పేర్కొన్నాడు. దీంతో ఐర్లాండ్‌తో మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.