ఐర్లాండ్‌పై ధావన్ ధూంధాం
వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా మీసాల మెనగాడు శిఖర్ ధావన్ రెచ్చిపోతున్నాడు. పరుగుల వేటలో దూసుకెళుతోన్న భారత ఓపెనర్ ఐర్లాండ్ పై సెంచరీతో శివమెత్తాడు. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ధావన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్ కు 174 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఐరిష్ బౌలర్లపై విరుచుకుపడ్డ ధావన్ కేవలం 84 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 11 బౌండరీలు, 5 సిక్సర్లు బాదిన ధావన్ ఈ వరల్డ్ కప్లో రెండో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్ గా ధావన్ కు ఇది 8వ వన్డే సెంచరీ. ధావన్ సెంచరీ చేసిన ప్రతీ మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించడం విశేషం. ఇక టోర్నీ పరుగుల జాబితాలో ధావన్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచుల్ లో ధావన్ 66.6 సగటుతో 333 పరుగులు సాధించాడు.