ఐవోఏ కొత్త ప్రెసిడెంట్‌గా చౌతాలా
న్యూఢిల్లీ, నవంబర్ 30: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం అంతా ఏకగ్రీవంగా ఎన్నికైంది. ముందు ఎన్నికల బరిలో నిలిచిన వారంతా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ప్రెసిడెంట్‌తో పాటు సెక్రటరీ ఎంపిక కూడా ఎలాంటి తంతు లేకుండా ముగిసినట్టు తెలుస్తోంది. దీంతో ఐవొఎ కొత్త అధ్యక్షునిగా అభయ్ చౌతాలా బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగు రోజుల క్రితం చౌతాలాపై పోటీ చేసేందుకు ప్రయత్నించిన రణ్‌ధీర్‌సింగ్ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఎలాంటి హంగామా లేకుండానే ముగిసింది. అటు కొత్త సెక్రటరీ జనరల్‌గా లలిత్ భానోత్ ఎంపికయ్యారు. కామన్‌వెల్త్‌గేమ్స్ కుంభకోణంలో కల్మాడీకి సన్నిహితునిగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొంటున్న భానోత్ ఎన్నిక కూడా ఏకగ్రీవంగానే ముగియడం విశేషం. సెక్రటరీ పదవికి పోటీ చేసిన మిగిలిన అభ్యర్థులందరూ చివరి నిమిషంలో అనూహ్యంగా నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో భానోత్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కల్మాడీతో పాటు ఈ ఏడాది ప్రారంభంలో అరెస్టై జైలులో ఉన్న లలిత్ భానోత్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు. అటు మిగిలిన కార్యవర్గానికి సంబంధించిన సభ్యులు కూడా ఎన్నికల లేకుండానే ఎంపికవడం విశేషం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐవోఎపై సస్పెన్షన్ వేటు వేసే ప్రమాదం లేనట్టే. ఒలింపిక్ నిబంధనలను అనుసరించి కాకుండా , ప్రభుత్వ ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు జరపాలని భారత ఒలింపిక్ సంఘం నిర్ణయించుకోవడంతో వేటు వేయాలని ఐవోసి నిర్ణయించింది. అయితే చివరికి ఎన్నికలు తంతు లేకపోవడంతో ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.