ఒకేసారి రుణమాఫీకి ప్రయత్నిస్తున్నాం

2
మంత్రి పోచారం

హైదరాబాద్‌ అక్టోబర్‌6(జనంసాక్షి): రైతుల రుణాలను వీలైనంత త్వరగా బ్యాంకులకు వన్‌ టైం సెటిల్‌ మెంట్‌ ద్వారా చెల్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని టిఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్ష రూపాయల లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామన్న హావిూని అమలు చేశామని ఆయన చెప్పారు. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం ప్రభుత్వమే వడ్డీతో సహా చెల్లిస్తుందని, రైతులకు సంబంధం లేదని మంత్రి తేల్చిచెప్పారు. రైతులు రుణ విముక్తులైనట్టు బ్యాంకు మేనేజర్లు, తహసీల్దార్‌ సంతకంతో కూడిన సర్టిఫికెట్లు కూడా ఇచ్చారని ఆయన తెలిపారు.

అసెంబ్లీలో ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్‌ బీఏసీ విూటింగ్‌ లోనే స్పష్టం చేశారని పోచారం గుర్తుచేశారు. ఐనా, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించినమని, విపక్షాలు మాట్లాడుతున్నప్పుడు తాము అడ్డుపడలేదన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

రైతు సమస్యలపై సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో చాలా వివరంగా సమాధానమిచ్చిన్రని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా ఇస్తున్నామని పోచారం తెలిపారు. రైతు రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినా విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి పోచారం విమర్శించారు.

ఏపీలో టీడీపీ ప్రభుత్వం 30 శాతం కూడా రైతు రుణాలు మాఫీ చేయలేదని లెక్కలు చూపించారు. కరెంట్‌ చార్జీలు తగ్గించమంటే ప్రజలను కాల్చిచంపింది టీడీపీ కాదా? అని ప్రశ్నించారు. అలాంటి టీడీపీ ఇక్కడ ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని ఎడారిగా మార్చింది గత పాలకులేనన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి నీటి పారుదల సౌకర్యం కల్పించినట్టియితే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని పోచారం నిలదీశారు.

తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్‌ పక్కా ప్రణాళికలు రూపొందించారని మంత్రి పోచారం చెప్పారు. ప్రభుత్వ పథకాలన్ని అమలైతే కాళ్ల కింద భూమి కదిలిపోతుందని ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని ఆయన అన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.